Mysterious Disease: పశ్చిమ గోదావరిలో మళ్లీ మిస్టరీ వ్యాధి కలకలం, కొవ్వలి గ్రామానికి పాకిన అంతుచిక్కని వైరస్, గ్రామంలో పర్యటించిన దెందులూరు ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్యచౌదరి
తొలిసారి ఏలూరులో మిస్టరీ వ్యాధి కలకలం రేపగా ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో అంతుచిక్కని వ్యాధి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
Amaravati, Jan 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతుచిక్కని వ్యాధులు (Mysterious Disease) కలకలం రేపుతున్నాయి. తొలిసారి ఏలూరులో మిస్టరీ వ్యాధి కలకలం రేపగా ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో అంతుచిక్కని వ్యాధి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. దాని జాడలు మాయమవుతున్న తరుణంలో మళ్లీ ఆ జిల్లాలో మిస్టరీ వ్యాధి కలకలం రేపుతోంది. దెందులూరు మండలం లోని కొవ్వలి గ్రామంలో వింత వ్యాధి (Mysterious Disease in Kovvali) తాజాగా కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తమయ్యింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్యచౌదరి కొవ్వలి గ్రామంలో మంగళవారం పర్యటించారు. ప్రజలెవరూ భయాందోళన చెందనవసరం లేదన్నారు. కాగా, జిల్లాలో అంతు చిక్కని వింత వ్యాధి పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని రోజులుగా కొమరవోలు, పూళ్లలో విస్తరించిన అంతుచిక్కని వ్యాధిపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంతో వ్యాధి ప్రభావం పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది.
ఈ వింత వ్యాధికి గురై డిశార్జ్ అయిన రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయం, వారు తీసుకుంటున్న ఆహార పానీయాలపై కూడా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంటింటికి సర్వే కొనసాగుతుంది. ప్రజలు ఎవరు ఎక్కడా కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని ఎక్కడైనా వింత వ్యాధి లక్షణాలు ఉంటే వారికి పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది
వైద్యులకు సవాల్‌గా మారిన ఏలూరులో అంతుచిక్కని వ్యాధి, అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి
ఈ వ్యాధి ప్రభావంతో స్థానికులు ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దెందులూరు మండలంలోని కొమరేపల్లి గ్రామంలో (mysterious disease in Komirepalli) ఇప్పటి వరకు 14 మంది అస్వస్థతకు గురికాగా.. బాధితులను ఏలూరు, గుండుగొలనులోని హాస్పిటలకు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్న అనంతరం ఆరుగురు బాధితులు ఇంటికి చేరుకున్నారు. అయితే ఏలూరు, పూళ్ల తరహాలో వింత వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామంలో ఇప్పటి వరకు 36 మంది మిస్టరీ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా బత్తిన బుల్లబ్బాయ్ అనే వ్యక్తి చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. వింత వ్యాధికి, సదరు వ్యక్తి మృతికి సంబంధం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. సమస్యకు సరైన కారణాలు తెలియక గోదావరి జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు.