Eluru Mystery Disease: వైద్యులకు సవాల్‌గా మారిన ఏలూరులో అంతుచిక్కని వ్యాధి, అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి, రేపు ఏలూరులో పర్యటించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్
AP Chief Minister CM YS Jagan Mohan Reddy | File Photo.

Amaravati, Dec 6: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి (Eluru mystery disease) కలకలం రేపుతున్న సంగతి విదితమే. ఈ వ్యాధి సోకి అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతిచెందారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అతను ఉదయం మూర్చ లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా సరైన వైద్యం అందకనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుపట్టని వ్యాధితో (Mystery Disease in Eluru) అస్వస్థతకు గురైన వారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan In Eluru Tomorrow) రేపు పరామర్శించనున్నారు. రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరుతారు. ఉదయం 10:20 గంటలకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తర్వాత స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం అవుతారు. ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్‌ (AP CM YS Jagan) ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు.

ఏలూరు అంతు చిక్కని వ్యాధికి కారణం అదేనా? ఘటనపై ఏపీ సీఎం వైయస్ జగన్ ఆరా, రెండో సారి బాధితులను పరామర్శించిన ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిన అధికారులు

తక్షణం తగు చర్యలు తీసుకోవాలని మంత్రిని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు.

సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కూడా రేపు ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు.

అంతుపట్టని వ్యాధితో వణుకుతున్న ఏలూరు, ఫిట్స్‌ మాదిరి నోటి వెంట నురగతో పడిపోతున్న ప్రజలు, భయపడాల్సిందేమి లేదని తెలిపిన వైద్యులు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 270కి చేరింది. అస్వస్థతకు గురైన బాధితులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటివరకు 117 మందిని డిశ్చార్జ్‌ చేశామని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం పదిమందిని అధికారులు విజయవాడ తరలించారు. బాధితులకు వైద్యసిబ్బంది అలుపెరగకుండా సేవలు అందిస్తున్నారు.

లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్య బృందం.. ఇంటింటికి ఆరోగ్య సర్వే చేపట్టింది. టెస్టుల కోసం శాంపిల్స్‌ను అధికారులు వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఫిట్స్ లక్షణాలతో చేరిన బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో అదనపు బెడ్‌లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రి ఆళ్లనాని పర్యవేక్షణలో కలెక్టర్, అధికారులు చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ ద్వారా కలెక్టర్‌.. అధికారులకు దిశానిర్దేశం చేశారు

నీరు, ఫుడ్ పాయిజన్‌ లాంటివి ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. విజయవాడ ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. నిపుణుల బృందాలు కూడా ఏలూరు రానున్నాయి. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో వాలంటీర్లు సర్వే చేపట్టారు