People Fell Illness In Eluru (Photo-Twtter)

Eluru, Dec 6: గత రెండు రోజుల నుంచి ఏలూరు నగరం విచిత్రమైన వ్యాధితో (People Fell Illness In Eluru) వణికిపోతుంది. వన్‌టౌన్‌లోని దక్షిణపు వీధి, పడమరవీధి, టూటౌన్‌ ప్రాంతంలోని గన్‌బజార్, కొత్తపేట, అశోక్‌నగర్, రూరల్‌ ప్రాంతంలోని శనివారపుపేట ఏరియా ప్రజలు అంతుచిక్కని వ్యాధితో అస్పత్రి పాలవుతున్నారు. పలువురు ఫిట్స్‌ మాదిరి నోటి వెంట నురగతో పడిపోవడంతో (many people fell ill in eluru padamara veedhi) కుటుంబీకులు వారిని హాస్పిటల్‌కు తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరహాగా వ్యాధి ఉండటంతో వైద్యులకు జబ్బు ఏమిటో అర్థంకాలేదు.

వ్యాధితో అలా పడిపోయిన వారు 10 నుంచి 20 నిమిషాల అనంతరం తిరిగి మామూలు స్థితికి చేరుతున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పదుల సంఖ్యలో జనం కళ్లు తిరుగుతూ పడిపోగా.. రాత్రికి ఈ సంఖ్య 100 వరకు చేరింది.అయితే ఎవరికీ ప్రాణాపాయం లేకున్నా ఆకస్మికంగా పడిపోవటంతో ప్రజలు భయపడుతున్నారు.

దీనిపై వైద్యులు అప్రమత్తమయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంచార్జి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్యసేవలు అందిస్తోంది. ఈ మేరకు వైద్యుల బృందం మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరు నగరంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మంత్రి ఆళ్ల నాని (Health Minister Alla Nani) ఆదేశాల మేరకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ళపల్లి జై ప్రకాష్ ప్రభుత్వ ఆస్పత్రిలో మకాం వేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సమన్వయం చేస్తున్నారు.

అంబటి రాంబాబుకు మళ్లీ కరోనా, ఏపీలో తాజాగా 630 మందికి కోవిడ్ పాజిటివ్, 8,71,305కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, ప్రస్తుతం 6,166 యాక్టివ్ కేసులు

ఏలూరులో అనారోగ్యానికి గురైన ప్రాంతాలలో ప్రత్యేకంగా మెడికల్ టీమ్‌లు, ఇంటింటి సర్వే చేపట్టామని తెలిపారు. కాగా, మంత్రి ఆదేశాల మేరకు ఏలూరు ఆర్డీవో పనబాక రచన, ఎమ్మార్వో సోమశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు.వైద్య చికిత్స అనంతరం అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులు కోలుకుని క్రమంగా డిశ్చార్జ్‌ అవుతున్నారు. శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 20 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక పర్యవేక్షణలో ఏలూరు కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని మోనిటరింగ్ చేయడానికి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే సత్వరమే వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. పది 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. వైద్యులు నిత్యం హాస్పిటల్‌లో ఉండాలని డిప్యూటీ సీఎం నాని ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ వ్యాధి ఏంటనేది మాత్రం తెలియడం లేదు. వైద్యులు స్కానింగ్‌ తీసినా ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారణ కావటం సందేహాలకు తావిస్తోంది. ఇలా మూర్చపోయి పడిపోతున్న వ్యక్తులు కొంత సేపటికి తేరుకుని మామూలు స్థితికి వస్తున్నారు. ఇదంతా వైద్యులకే అంతుచిక్కటం లేదు. బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయటం, రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేస్తేగాని వ్యాధి ఏమిటనేది చెప్పలేమని వైద్యులు అంటున్నారు.

ఇలా మూర్చపోతూ అనారోగ్యం బారిన పడిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. కలుషితమైన వాతావరణం, గాలిలో మార్పులు, పరిసరాల పరిశుభ్రత వంటివి కూడా ప్రభావితం చేస్తాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.