Pink Diamond Case: విజయసాయి రెడ్డికి ఊరట, శ్రీవారి పింక్‌ డైమండ్‌ విచారణకు నో చెప్పిన ఏపీ హైకోర్టు, పిల్‌ దాఖలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్‌

డైమండ్ విషయంలో తగిన విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు (AP high court) మంగళవారం తోసిపుచ్చింది.

File image of High Court of Andhra Pradesh | File Photo

Amaravati, Jan 20: తిరుమల శ్రీవారి పింక్‌ డైమండ్‌ వ్యవహారం (Pink Diamond Case) మరోసారి తెరపైకి వచ్చింది. డైమండ్ విషయంలో తగిన విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు (AP high court) మంగళవారం తోసిపుచ్చింది. పింక్‌ డైమండ్‌ విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు కమిటీలు రెండు నివేదికలు ఇచ్చాయని, అందువల్ల దీనిపై మళ్లీ విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

ఈ మేరకు సీజే జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.పింక్‌ డైమండ్‌ విషయంలో విచారణకు ఆదేశించాలని కోరుతూ టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్‌ పిల్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ అప్పటి ప్రధానార్చకులు రమణ దీక్షితులు, అప్పటి ఈవోలు ఐవైఆర్‌ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. సాయిరెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది.