Srivari Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శనం ,ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్..శ్రీవారి సన్నిధిలో గడ్కరీ
ఇక ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.
Tirumala, Jul 18: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారులు తీరారు. ఇక ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమలకు చేరుకున్న గడ్కరీకి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి అక్టోబర్ నెల దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా రిలీజ్ అయింది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు , శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయాల్లో ఆణివార ఆస్ధానం శాస్త్రోక్తంగా జరిగింది. టీటీడీ పరిధిలోని 450కి పైగా ఆలయాల్లో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు.
అలాగే అక్టోబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు ,తిరుమల, తిరుపతిలలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. టికెట్లకు సంబంధించి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.