Daikin New Factory in AP: ఏపీలో మరో కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు, శ్రీసిటీలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్న డైకిన్, సుమారు 3,000 మందికి ఉపాధి

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐఎస్‌–ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌) (PLI scheme for white goods) కింద ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని (Daikin New Factory in AP) ఏర్పాటుచేయడానికి జపాన్‌ ముందుకొచ్చింది.

Daikin New Factory in AP (Photo-Twitter)

Amaravati, Sep 25: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐఎస్‌–ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌) (PLI scheme for white goods) కింద ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని (Daikin New Factory in AP) ఏర్పాటుచేయడానికి జపాన్‌ ముందుకొచ్చింది. ఆ దేశానికి చెందిన డైకిన్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ డైకిన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో ఎయిర్‌ కండిషనింగ్, విడిభాగాల తయారీ (AC manufacturing plant in Andhra Pradesh) యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.

చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని పారిశ్రామికవాడ శ్రీసిటీలో 75.5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ ఏర్పాటుకానుంది. ఈ మేరకు అక్కడ భూమి కొనుగోలుకు సంబంధించి రెండింటి మధ్య ఒప్పందం కుదిరినట్లు శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీసిటీలో జరిగిన కార్యక్రమంలో డైకిన్‌ ఇండియా ఎండీ, సీఈఓ కన్వల్‌జీత్‌ జావాతోపాటు శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి ఒప్పంద పత్రాలపై శుక్రవారం సంతకాలు చేశారు.

ఏపీలో 14,391 పోస్టుల భర్తీ సీఎం గ్రీన్ సిగ్నల్, అక్టోబరు 1 నుంచి నవంబర్‌ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు

ఈ యూనిట్‌ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని, 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డైకిన్‌ తెలిపింది. దిగుమతులను తగ్గించి స్వయం సంవృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం 13 రంగాలకు పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన తొలి కంపెనీగా డైకిన్‌ రికార్డు సృష్టించింది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర అధికారులు పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు.

అపారమైన అవకాశాలున్న దేశీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు కన్వల్‌జీత్‌ జావా తెలిపారు. ఇప్పటికీ 5–6 శాతం మంది మాత్రమే ఏసీ వినియోగిస్తుండడంవల్ల ఈ రంగం వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలున్నాయన్నారు. తక్కువ వ్యయంతో అత్యుత్తమ ఉత్పత్తుల కోసం దేశ ప్రజలు చూస్తున్నారని, ఆ దిశగా తాము కృషిచేస్తున్నామని.. ఇందుకోసం రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అమెరికా, మధ్య ఆసియా దేశాల ఎగుమతులకు ఏపీ కీలకంగా ఉండటంతో దీన్ని ఆఫ్‌షోర్‌ డెలివరీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో వ్యాపారానికి అనువైన వాతావరణంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు, నైపుణ్య కలిగిన మానవ వనరులు ఉండటం కూడా తమకు కలిసొచ్చే అంశాలుగా కన్వల్‌జీత్‌ జావా పేర్కొన్నారు. శ్రీసిటీలో యూనిట్‌ ఏర్పాటులో పూర్తిగా సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇక దేశంలో ఇప్పటికే రెండు యూనిట్లు కలిగి ఉన్న డైకిన్‌.. దక్షిణాలో తొలి యూనిట్‌ ఏర్పాటుకు శ్రీ సిటీని ఎంచుకోవడం గర్వంగా ఉందని ఆ సంస్థ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. ఎయిర్‌ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్‌ రంగంలో ప్రపంచ ఖ్యాతి పొందిన జపాన్‌ దిగ్గజ సంస్థ డైకిన్‌ గ్రూప్‌ శ్రీసిటీకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది శ్రీ సిటీకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపారానికి కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అనువైన వాతావరణంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.