Amaravati, Sep 25: ఏపీ రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వాసుపత్రుల్లో (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాసుపత్రుల వరకూ) 14,391 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఆమోదం (CM YS Jagan gives green signal for recruitment ) తెలిపారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి నియామక ప్రక్రియను ప్రారంభించి నవంబరు 15 నాటికి పూర్తి చేసేలా అధికారులు రూపొందించిన కార్యాచరణ అమలుకు పచ్చజెండా ఊపారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వైద్యారోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 1 నుంచి పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
సీఎం జగన్ మాట్లాడుతూ..కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఆసుపత్రులను నిర్మిస్తున్నాం. తీరా అక్కడ వైద్య సిబ్బంది లేక రోగులకు సేవలు అందట్లేదు. ఏళ్ల తరబడి ఇలాంటి సమస్యలే ఉంటున్నాయి. ఇకపై వాటికి అడ్డుకట్ట పడాలి. వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి పోవాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందాలి.
ఆ లక్ష్యం దిశగా అధికారులు అడుగులు వేయాలి. అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలి’’ అని ఆదేశించారు. కుటుంబ వైద్యుడు (ఫ్యామిలీ డాక్టర్) కాన్సెప్ట్‌ను మొదలుపెట్టాలని, అన్ని ప్రభుత్వాసుపత్రులను సరిపడా సిబ్బందితో సమర్థంగా నడపాలని పేర్కొన్నారు. ఒక వైద్యుడు సెలవులో వెళ్తే ఆ స్థానంలో మరొకరు విధులు నిర్వహించేలా తగినంత మందిని వైద్యుల్ని నియమించాలని ఆదేశించారు.