AP Municipal Polls 2021: ఏపీలో పుర, నగర పాలక పంచాయతీల్లో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌, ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్‌ జరుగుతుంది.

Assembly Elections 2021- Representational Image | (Photo-PTI)

Amaravati, Mar 10: ఏపీలోని పుర, నగర పాలక పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ (Municipal Elections Polling) ప్రారంభమైంది. ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్‌ జరుగుతుంది. రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు ఎన్నికలు (AP Municipal Polls 2021) జరగనున్నాయి. మొత్తం 2,214 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 7,915 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వీటిలో 2,320 అత్యంత సమస్యాత్మకమైనవి కాగా.. 2,468 సమస్యాత్మకమైనవి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దృష్టి కేంద్రీకరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు రాష్ట్రంలో తొలిసారి బుధవారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నారు. రాజ్‌భవన్‌ సమీపంలో ఉన్న సీవీఆర్‌జీఎంసీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో గవర్నర్‌ దంపతులు బుధవారం ఉదయం 11 గంటలకు ఓటు వేస్తారని గవర్నర్‌ కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

కేంద్రం నిర్ణయం మార్చుకోవాలి, మరోసారి ప్రధానికి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరిన వైసీపీ అధినేత

మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం(10వ తేదీ) హైకోర్టుకు సెలవు దినంగా ప్రకటించారు. అలాగే హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ సెంటర్‌లకు కూడా సెలవు ప్రక టించారు. దీనికి బదులుగా మే 1(శని వారం)ని పనిదినంగా నిర్ణయించారు. అలాగే శివరాత్రి మరుసటి రోజు సెలవు కావాలంటూ హైకోర్టు ఉద్యోగుల సంఘం పెట్టుకున్న వినతిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం 12వ తేదీన కూడా సెలవు ఇచ్చింది. దీనికి బదులు ఈనెల 20వ తేదీ(శనివారం)ని పనిదినంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని రిజిస్ట్రార్‌ జనరల్‌ భానుమతి మంగళవారం తెలియజేశారు.

ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలిగాయి. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నిక నిర్వహించవచ్చని, ఓట్ల లెక్కింపు మాత్రం చేపట్టవద్దని, ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ధర్మాసనం మంగళవారం స్టే విధించింది. బ్యాలెట్‌ బాక్సులను జాగ్రత్త చేయాలని, హైకోర్టు ఆదేశిస్తే కానీ వాటిని తెరవడానికి వీల్లేదని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది

తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం, ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లను సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉంచదలచుకోలేదని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది.ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ టీడీపీ నేత ఎస్‌వీ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మార్చి 19 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశం, ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపల్‌ పాలకవర్గ ఎన్నికల నిర్వహణకు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం ఎన్నిక నిర్వహించుకోవచ్చన్న న్యాయస్థానం ఎన్నికల ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. ఈ విషయాన్ని అభ్యర్థులకు అందజేసే ధ్రువీకరణ పత్రాల్లో స్పష్టంగా పేర్కొనాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులిచ్చారు.

మానుకొండవారిపాలెం, పసుమర్రు, గణపవరం పంచాయతీలను చిలకలూరిపేట మునిసిపాలిటీలో విలీనం చేస్తూ గతేడాది జనవరిలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ టి.పూర్ణచంద్రరావు, జి.రవితేజ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు ఆ జీవోల అమలును నిలిపేస్తూ గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది సత్యశివాజీ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులను అభ్యర్థించారు