Amaravati, Mar 9: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలను (AP Assembly Sessions 2021) నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశాల్లోనే (Andhra Pradesh Assembly sessions 2021) బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులను ఆమోదించాలని రాష్ట్రం ప్రభుత్వం యోచిస్తోంది. మరో వైపు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ వ్యూహాలు రెడీ చేస్తోంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై సీఎం ప్రధానికి రెండు సార్లు లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని, ఆంధ్రుల హక్కును కాపాడాలని సీఎం లేఖలో కోరారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటా లేదు.. రాష్ట్ర ప్రభుత్వానికి దీనితో ఎలాంటి సంబంధం లేదు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నాం.. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తాం’’ అంటూ కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.