CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Mar 9: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించవద్దని, కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని ఈ లేఖలో (AP CM YS Jagan Mohan Reddy Writes To PM Modi) విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరిన సీఎం జగన్‌, తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకువస్తానని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశం. స్టీల్‌ప్లాంట్‌పై (Visakha Steel Plant Privatization) ప్రత్యక్షంగా 20వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొస్తాం. ఏపీ ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను మీ ముందు ఉంచుతాం. ప్లాంట్‌ పునరుద్ధరణకై మన ముందున్న ఆప్షన్లను నేరుగా వివరిస్తాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ తన లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్‌పై దృష్టిపెడితే కచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని పునరుద్ఘాటించారు.

ఇదిలా ఉంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి సోమవారం నిర్వహించిన లోక్‌సభ బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేందుకు అధిక సమయం ఇవ్వాలని కోరాము. దీనికి లోక్‌సభ స్పీకర్ సానుకూలంగా స్పందించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలందరం కేంద్రమంత్రులను కలిశాం. అలానే పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులన్నీ కేంద్రమే భరించాలి.. సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరాం.పోలవరం, విశాఖ ఉక్కు అంశాలపై పార్లమెంట్‌లో పోరాడుతాం’’ అని మిథున్‌ రెడ్డి తెలిపారు .

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు, పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచన

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనపై ఉక్కు కార్మీక వర్గం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్కు కార్మీకులు కూర్మన్నపాలెం కూడలి వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా గత 25 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం మంత్రి ప్రకటన తెలిసిన వెంటనే స్టీల్‌ప్లాంట్‌ కార్మీక నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది.

పోలీసులు సర్దిచెప్పటానికి ప్రయత్నించినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. ఇంతలో అక్కడికి యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు వచ్చారు. ఆయన కారును ఆందోళనకారులు కొద్దిసేపు అడ్డుకున్నారు. సాయంత్రం 6.30కి ప్రారంభమైన రాస్తారోకో రాత్రికి కూడా కొనసాగింది,. పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, విళ్లా రామ్మోహన్‌కుమార్, వి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రం చేసిన ప్రకటన దుర్మార్గమైనదన్నారు. ప్రతి ఆంధ్రుడు ఖండిస్తున్నారన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.