Vizag Steel Plant Privatisation: రూ.8 వేల కోట్లు అయినా, రూ.42 వేల కోట్లైనా నేను కొంటా, విశాఖ ఉక్కుపై హైకోర్టులో కేఏ పాల్ పిల్, తెలుగు తెలిసిన విశ్రాంత న్యాయమూర్తి నియమించాలని సూచన
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని నామమాత్రపు ధరకు విక్రయించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ (Praja Shanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో పిల్ (ka paul pil) దాఖలు చేశారు.
Vizag, April 28: విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని నామమాత్రపు ధరకు విక్రయించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ (Praja Shanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో పిల్ (ka paul pil) దాఖలు చేశారు. ఉక్కు కర్మాగారం ఆదాయ, వ్యయాలపై విచారణ జరిపేందుకు తెలుగు తెలిసిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోర్టును కోరారు.
అంతేకాక విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant Privatisation) నడిచేందుకు రూ. 8 వేల కోట్లు అయినా, రూ.42 వేల కోట్లైనా తన గ్లోబల్ పీస్ సంస్థ ద్వారా విరాళాల రూపంలో సేకరిస్తానని, ఇందుకోసం అనుమతినిచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా కోరారు.
గురువారం ఉదయం ఆయన స్వయంగా హైకోర్టుకు (AP High Court) వచ్చి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ముందు తన పిల్ గురించి ప్రస్తావించారు. తన వ్యాజ్యంపై లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం విచారణ చేపడతామని ధర్మాసం పేర్కొంది.
కాగా విశాఖ స్టీల్‌ప్లాంట్ కమిటీ ముందుకు వస్తే ఉక్కు కర్మాగారాన్ని కొంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కె.ఎ.పాల్ గతంలో పేర్కొన్నారు. సింగరేణి కాపాడలేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ స్టీల్‌ప్లాంట్ కొనేందుకు బిడ్ వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని ఆ పార్టీ చీఫ్ కేఏ పాల్ కోరారు. నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడిన పాల్.. పవన్ కనుక తనతో వస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్నారు. పవన్ మళ్లీ బీజేపీతో ఎందుకు జతకట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అలాగే, ఏపీ ప్రభుత్వంపైనా పాల్ విరుచుకుపడ్డారు. 3 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే గంగవరం పోర్టును రూ. 3 వేల కోట్లకు అదానీకి అన్యాయంగా అమ్మేశారని మండిపడ్డారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై మాట్లాడుతూ.. ఈ కేసు విచారణలో డ్రామా నడుస్తోందన్నారు. బాధితులకు న్యాయం చేయాలని తాను ఇప్పటికే సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ను కలిసి కోరినట్టు వెల్లడించారు. అలాగే, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశానని చెప్పారు.
వివేకాను ఎవరు? ఎందుకు? చంపారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కుటుంబ హత్యా? లేదంటే, రాజకీయపరమైన హత్యా అన్నది తేలాలన్నారు. కాగా, తెలంగాణ సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించాలని తాను కేసీఆర్‌ను కోరానని, కానీ ఆయన హిట్లర్ చనిపోయిన రోజున ప్రారంభిస్తున్నారని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.