Andhra Pradesh police summons Director Ram Gopal Varma for Allegedly Sharing Morphed Photos of CM N Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan

Vjy, Nov 20: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్‌ పిటిషన్‌ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది..

పోలీసుల నోటీసుల ప్రకారం.. ఈ నెల 19వ తేదీన మంగళవారం రోజు వర్మ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆ రోజు ఉదయమే ఈ రోజు విచారణకు రాలేను.. మరికొంత సమయం కావాలంటూ సంబంధిత పోలీసులకు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టారు.. ఇక, ఆ తర్వాత.. ఆర్జీవీ తరపున పోలీస్ స్టేషన్‌కు వచ్చిన న్యాయవాదులు.. సినిమా షూటింగ్‌ కారణంగా ఆర్జీవీ ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోయారన్నారు. కొంత సమయం ఇవ్వాలని కోరారు.

పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

గత ఎన్నికలకు ముందు 'వ్యూహం' సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల మార్ఫింగ్ ఫొటోలను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించి ఆయనపై పోలీసు కేసు నమోదయింది. విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

పోలీసుల అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం.. విచారించిన హైకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టం చేయడం విదితమే. కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను మాత్రం విచారణకు స్వీకరించింది. పోలీసు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది.

ఈ క్రమంలో హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో వర్మ పేర్కొన్నారు. ఎవరి పరువుకూ భంగం కలిగించేలా తాను పోస్టులు పెట్టలేదని... వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు పెట్టలేదని తెలిపారు. తనను అరెస్ట్ చేసి, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.