Wine Shops (photo-X)

Vjy, Sep 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నేచంద్రబాబు సర్కారు తిరిగి ప్రవేశపెట్టనునుంది. ఈ కొత్త పాలసీ ద్వారా (New Liquor Policy in AP) మద్యం రిటైల్‌ వ్యాపారం (Retail liquor outlets) మొత్తం ప్రైవేటుకే అప్పగించనున్నారు. త్వరలో తీసుకురాబోయే నూతన మద్యం విధానంలో 3,396 దుకాణాల్ని నోటిఫై చేయనున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు.. గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 దుకాణాలు (10 శాతం) నోటిఫై చేయనున్నారు.

వీటన్నింటికీ దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని వ్యక్తైనా నిర్దేశిత రుసుములు చెల్లించి వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలుస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించనున్నారు. ఈ మేరకు నూతన ఎక్సైజ్‌ విధానం ఖరారు కోసం కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్‌ యాదవ్, గొట్టిపాటి రవికుమార్‌లతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమై పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఏపీలో నూతన మద్యం విధానం, సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరించిన అధికారులు

అనంతరం వారంతా సీఎంను కలిసి ఈ ప్రతిపాదనలు చూపించగా మార్పుచేర్పులు సూచించారు. బుధవారం జరగబోయే మంత్రివర్గం సమావేశంలో ఈ ప్రతిపాదనలు పెట్టనున్నారు. కాగా మద్యం రిటైల్‌ దుకాణాలు నిర్వహించే అధికారాన్ని ప్రభుత్వానికి మాత్రమే ఇస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్‌ చట్టాన్ని సవరించింది. అయితే కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోయే మద్యం విధానంలో ప్రైవేటుకే రిటైల్‌ వ్యాపారాన్ని అప్పగించాలని భావిస్తున్నందున దీనికి చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున త్వరలో దీనిపై ఆర్డినెన్సు జారీ చేయనున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించాక ఇది ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియంతా పూర్తయ్యేందుకు కనీసం 3,4 రోజులు సమయం పడుతుంది. ఈ నెల 22, 23 తేదీల్లో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

దరఖాస్తుల స్వీకరణ కోసం కనీసం ఏడు పనిదినాల్లో అవకాశం కల్పిస్తారు. కలెక్టర్ల నేతృత్వంలో లైసెన్సులు కేటాయిస్తారు. అక్టోబరు 4, 5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. గీతకార్మికుల విభాగంలోకి వచ్చే మొత్తం 6 కులాల కోసం ప్రత్యేకంగా 396 దుకాణాల్ని నోటిఫై చేయనున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలకూ దరఖాస్తులు ఆహ్వానిస్తారు. కొత్తగా ప్రీమియం స్టోర్లనూ ప్రవేశపెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది.