Andhra Pradesh Rains: నెల్లూరుకు దగ్గరగా వచ్చిన వాయుగుండం, రేపు తీరం దాటే అవకాశం, రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం, పూర్తి వివరాలు ఇవిగో..
ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.
Nellore, Oct 16: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.గురువారం(అక్టోబర్17) వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తీరందాటే సమయంలో60- 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గూడూరు, మనుబోలు, కావలి, నెల్లూరు సమీప ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే నెల్లూరుతో పాటు కావలిలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో, నెల్లూరుకు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించి రేపు (అక్టోబరు 17) ఉదయం పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటుతుందని పేర్కొంది.
Here's Cyclone Live Tracker
దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5 ఎస్డీఆఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.