Congress Vijayabheri Sabha: రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ఇచ్చాం, కాని ఇప్పుడు కేసీఆర్ మీ ఆశలు ఆవిరి చేశాడు, కాంగ్రెస్ విజయభేరి సభలో గర్జించిన ప్రియాంకా గాంధీ
తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం దక్కలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రియాంకా గాంధీ పాల్గొని ప్రసంగించారు
Hyd, Oct 18: BRS పాలనలో ప్రజలు ఆనందంగా లేరు. తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం దక్కలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రియాంకా గాంధీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ సభలో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ఒక పుణ్యభూమి. తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలు త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ అర్థం చేసుకుంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చాం. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇస్తుంది." అని ప్రియాంకగాంధీ అన్నారు. రాజకీయంగా నష్టమని తెలిసినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని వివరించారు.
ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారు. సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని అనుకున్నారు. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని అనుకున్నారు. తెలంగాణ వస్తే రైతుల జీవితాలు బాగుపడతాయని ఆశించారు. కానీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసింది. రాజకీయ లబ్ధికోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చారు.
ఇక్కడి ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలు ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ రూపొందించింది. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.
తెలంగాణలో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని, అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. ఇందిరమ్మ పక్కా గృహాల పథకం కింద ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు భూమితో పాటు వారి ఇళ్ల నిర్మాణానికి రూ. 6 లక్షలు ఇస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రిమోట్ ప్రధాని మోదీ చేతిలో ఉంది. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయి. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మద్యం మాఫియా రాష్ట్రాన్ని దోచుకుంటోంది. రంగారెడ్డి జిల్లాలోని రూ.వేలకోట్ల విలువన భూములు భారాస పెద్దలు దోచుకున్నారు. భూదాన్ భూములను ఆన్‌లైన్‌లో తొలగించి ఆక్రమించుకున్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు.18 మంత్రిత్వశాఖలు కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నాయి.
బీఆర్ఎస్ నేతలు రూ.వందల కోట్లు లూటీ చేసి భారీ భవనాలు కట్టుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం న్యాయం జరగటం లేదు. ఎవరి జనాభా ఎంత ఉందో తెలియకుండా ఎలా న్యాయం చేస్తారు?’’ అని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.
తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మన ముందుకు వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది... కానీ ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇచ్చారు. పేద ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తాం. ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలి." అని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సభలో సీతక్క మాట్లాడుతూ ములుగులో అనేక కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. వాళ్లు ఎన్ని చేసినా ప్రజలే నాదేవుళ్లు. నియోజకవర్గం విడిచి నేను ఎక్కడికీ వెళ్లను." అని సీతక్క అన్నారు.