Revanth Reddy AP Tour: ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడలో జరిగే కార్యక్రమంలో షర్మిలతో కలిసి పాల్గొననున్న రేవంత్
ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను షర్మిల స్వయంగా వెళ్లి వైఎస్ ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు.
Vijayawada, July 07: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్ వెళ్లనున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (Sharmila) ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న వైఎస్సార్ జయంతి సభలో రేవంత్ రెడ్డి (Revanth reddy) పాల్గోనున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కూడా పాల్గొనున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి (YSR Jayanthi) వేడుకలు సోమవారం విజయవాడ (Vijayawada) సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రముఖులను షర్మిల ఆహ్వానించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోపాటు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను షర్మిల స్వయంగా వెళ్లి వైఎస్ ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర క్యాబినెట్ మంత్రుల వద్దకు షర్మిల స్వయంగా వెళ్లి ఆహ్వానాన్ని అందించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు రేపు విజయవాడలో జరిగే వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గోనున్నారు.