Tirupati By-Election 2021: తిరుపతిలో ఫ్యాను గెలుపు తధ్యమా..మెజార్టీ ఎంత ఉండబోతోంది? అధికార ప్రతిపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు, వీడియోలు 7557557744 నంబర్‌కు వాట్సాప్ చేస్తే అకౌంట్‌లో పదివేలు వేస్తామనంటున్న అచ్చెన్నాయుడు, నామినేషన్లు దాఖలు చేసిన మూడు పార్టీల అభ్యర్థులు
వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల ఆగడాలను బయటపెట్టాలని అన్నారు.
Tirupati, Mar 29: వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో వేడెక్కిస్తూ గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయి. మంగళవారానికి నామినేషన్ల పర్వానికి (Tirupati By Elections Nominations) తెరపడనుండడంతో సోమవారం వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి (YSRCP candidate Dr Gurumurthy), బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ (Ratna Prabha) నామినేషన్లు వేశారు. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి (Panabaka Laxmi) నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుండగా ఎలాగైనా పట్టు సాధించాలని ప్రధాన పార్టీలన్ని వ్యూహాలు రచిస్తున్నాయి. ఏపీలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరుమీద ఉన్న వైసీపీ ఎలాగైనా సీటును దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
కాగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ (Tirupati Lok Sabha constituency) పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్‌సీపీ (YSR Congress) ఖాతాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మొత్తం 16,50,453 ఓట్లలో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది.
అందులో 55శాతం 7,22,877 ఓట్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌కు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి 37శాతంతో 4,94,501 ఓట్లు సాధించారు. దీంతో వైఎస్సార్‌సీపీ 2,28,376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో సైతం భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటును వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా రెండో స్థానంలో టీడీపీ నిలిచింది. 25,787 ఓట్లతో నోటా మూడో స్థానం దక్కించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ 24,039ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. జనసేన మద్ధతుతో పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికి 20,971 ఓట్లు రాగా, బీజేపీ ఖాతాలో 16,125 ఓట్లు మాత్రమే పడ్డాయి. నోటా కంటే తక్కువ ఓట్లతో జాతీయ పార్టీలు డిపాజిట్లను కోల్పోయాయి.
తిరుపతి పార్లమెంట్ స్థానంలో తొలి నుంచి టీడీపీయేతర పార్టీలకే ప్రజలు ఎక్కువ పర్యాయాలు పట్టం కట్టారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన చింతామోహన్ గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1999లో టీడీపీ మద్ధతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి విజయం సాధించారు.
2004, 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్ గెలిచారు. 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వరప్రసాద్‌ను విజయం వరించింది. 2019 ఎన్నికల్లో కూడా ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తితో టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉంది.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రజా తీర్పు ఏకపక్షంగా ఉంటుందని.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి బంపర్ మెజార్టీ సాధిస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాభివృద్ధే ఫలితాన్ని నిర్దేశిస్తుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ వైసీపీ నేతలు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీ శ్రేణులకు సూచించారు. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల ఆగడాలను బయటపెట్టాలని అన్నారు.
ఈ నంబర్ కు సమాచారాన్ని అందించాలంటూ 7557557744 వాట్సాప్ నంబర్ ను ప్రకటించారు. ఈ నంబర్ కు కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ వాట్సాప్ చేస్తే... ఆ వ్యక్తుల అకౌంట్ లోకి రూ. 10 వేలు వేస్తామని చెప్పారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందని అన్నారు.
రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. తిరుపతిలోనే టీడీపీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. అయితే అధికార పార్టీ బెదిరింపులతో ఓటమి తప్పలేదన్నారు. పథకాలు పోతాయనే భయం అవసరం లేదని... ఆ డబ్బులు జగన్ రెడ్డి తాత డబ్బులో.. తండ్రి డబ్బులో కాదని.. అవి ప్రజల డబ్బులన్నారు. 10 పైసలు ఇచ్చి.. 90 పైసలు దోచుకుంటున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే.. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. "మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు... ఉప ఎన్నికలో డిపాజిట్లు వస్తే చాలు మనవాడు సీఎం అయిపోతాడన్నట్టు నటిస్తున్నారు" అని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. "ఎవరి పాత్రల్లో వారు జీవించండి, చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి... జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు" అంటూ వ్యాఖ్యానించారు. దీనికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు గట్టిగా బదులిచ్చారు.
"మా ఊసు ఎందుకులే విజయసాయి రెడ్డి గారూ..! కోర్టులకు చెవిలో పువ్వులు పెడుతూ, వెలుపల మేకపోతు గాంభీర్యం కనబరుస్తూ తిరుగుతున్నప్పటికీ అలీబాబా నలబై దొంగలంతా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారటగా" అని వ్యాఖ్యానించారు. "తిరుపతి ప్రజలకు మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజీ పువ్వులు మీకు పంపిస్తాం... బెయిల్ రద్దవగానే లోపల కూరకి ఉపయోగపడతాయి" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
తిరుపతి ఉపఎన్నికలో గెలుపొందేందుకు జనసేన, బీజేపీ కూటమి తీవ్ర కృషి చేస్తోంది. ఇరు పార్టీలకు చెందిన అగ్ర నాయకత్వం తిరుపతిలోనే మకాం వేసి ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీల నేతల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు జనసేన తరపున నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, జనసేనాని పవన్ కల్యాణ్ కు సముచిత గౌరవం ఇవ్వాలంటూ ప్రధాని మోదీ తనకు నేరుగా సూచించారని చెప్పారు. ఈ రాష్ట్రానికి పవన్ సీఎం కావాలని అన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను జనసైనికులు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. బేధాభిప్రాయాలు లేకుండా ఇరు పార్టీల శ్రేణులు ముందుకు సాగాలని చెప్పారు.
ప్రత్యేక హోదా అనేదే లేదని.. ఏపీకి అది ఇవ్వడం కుదరదని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చి.. ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ తరఫున పోటీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ తన జన్మభూమి అని.. కర్ణాటక తన కర్మభూమి అని తెలిపారు. తనకు అవకాశమిస్తే రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతానని చెప్పారు. జనసేనకు, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. డబ్బులకు అమ్ముడుపోకుండా ఓటు వేయాలని తిరుపతి ప్రజల్ని కోరారు.