Bye-Elections 2021: తిరుపతిలో జెండా పాతేదెవరు, సాగర్‌లో గెలుపెవరిది?, రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్, ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలు
Election Commission of India. File Image. (Photo Credits: PTI)

New Delhi, March 17: దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను (Bye-Elections 2021) కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 17 పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (Election Commission) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ ఉప ఎన్నికలకు వెళ్లనుండగా, వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీగా ఈసీ పేర్కొంది. ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది.

కాగా తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్‌ రావు(వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ), నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్‌) ఆకస్మిక మరణంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఫిబ్రవరి 26న షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో తిరుపతి, సాగర్‌ ఉప ఎన్నికకు సైతం ఆరోజే షెడ్యూల్‌ ప్రకటిస్తారని భావించినా, ప్రత్యేకంగా ఈసీ నేడు రిలీజ్‌ చేసింది.

ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం మీకు లేదు, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు తక్షణమే డిక్లరేషన్‌ ఇవ్వండి, ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు

ఇక అసోంలో మూడు విడతల్లో(126 స్థానాలు- మార్చి 27, ఏప్రిల్‌ 1, 6వ తేదీల్లో) తమిళనాడులో ఏప్రిల్‌ 6న ఒకే విడతలో(234 స్థానాలు), కేరళలో సైతం ఒకే విడత(140 స్థానాలు- ఏప్రిల్‌ 6)లో పోలింగ్‌ జరుగనుండగా, పశ్చిమ బెంగాల్లో మాత్రం (294 స్థానాలు) మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్‌ 1, 6, 10, 17, 22, 26, 29 తేదీల్లో అక్కడ పోలింగ్ చేపట్టనున్నారు.ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(30 స్థానాలు)లో ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. అయితే అన్నిచోట్లా ఫలితాలు మాత్రం మే2నే తేలనున్నాయి.

తిరుపతి లోక్‌సభ స్ధానానికి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్‌ గురుమూర్తిని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అలాగే టీడీపీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని చంద్రబాబు ఎంపిక చేశారు. జనసేనతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తమ అభ్యర్ధిని బరిలోకి దింపాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఎన్నికకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత జానారెడ్డి బరిలోకి దిగనున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా తమ అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోరు తప్పేలా లేదు.

తిరుపతి, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌- వివరాలు

►మార్చి 23న నోటిషికేషన్‌

►నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- మార్చి 30

►నామినేషన్ల పరిశీలన-మార్చి 31

►నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 3.

►ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్.

►మే 2న ఫలితాలు.