Vande Bharat Express: ఏపీకి మరో వందేభారత్ రైలు, విజయవాడ-చెన్నై మీదుగా రాకపోకలు సాగించనున్న ట్రైన్, ఈ నెల 7న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

Vande Bharat Express (Photo-PTI)

Vjy, July 3: ఏపీలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ-చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ రైలు 8వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ‌్య వందేభారత్‌ ప్రయాణికులకు అందుబాటులోకి ఉంది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య మరో రైలు నడుస్తోంది. తాజాగా మరో రైలు ఈనెల 7 నుంచి రైలు రేణిగుంట మీదుగా రాకపోకలు సాగించనుంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే వందేభారత్‌ రైలుకు ఏయే స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుంది, రాకపోకల షెడ్యూల్‌, టిక్కెట్‌ ధరలు, ప్రయాణ సమయం వంటి షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. కొత్త రైలును రేణిగుంట మీదగా నడపాలని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరినట్లు తెలిసింది.

146 అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్, 108 సేవల కోసం ఏటా రూ.188.56 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదగా చెన్నై వెళ్లి.. అదే మార్గంలో తిరిగి రానుంది. విజయవాడ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడ - చెన్నై మధ్య ఉన్న ఇంటర్‌ సిటీ రైలు ఆరున్నర గంటల్లో చెన్నై చేరుతోంది. కనిష్ట ప్రయాణ సమయంలో గమ్యస్థానాన్ని చేరుకునేలా షెడ్యూల్‌ ఖరారు చేసే అవకాశాలున్నాయి.