నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్లడించారు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గురువారం కోస్తా జిల్లాల్లో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఒకవైపు వర్షం.. పెరిగిన చలి తీవ్రత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తిరుమలలో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డుల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండటంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, గోగర్భం, పాపవినాశనం జలాశయాలలో పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. వర్షం కారణంగా తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం
ఇక తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ కాలనీ, కోర్లగుంట, సత్యనారాయణ పురం, లక్ష్మి పురం సర్కిల్‌లో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరుకుంది. వెస్ట్ చర్చి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా చేరుకుంది. దీంతో, వన్ వేలోనే వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిస్తున్నారు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు.
అల్పపీడనం తమిళనాడు వైపు వెళ్లడంతో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై (Chennai)కూడా తడిసి ముద్దయింది. భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విళ్లుపురం, కళ్లకురిచ్చి, రామనాథపురం, అరియలూరు, కడలూరు, కరైక్కల్, తిరుచ్చి, నాగపట్టణం, కోయంబత్తూర్ సహా తదితర జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా పలు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలాదుతురై, పుదుక్కోట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువావూర్, రాణిపేట్, తిరువళ్లూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చారు.ఇక పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వేలూరు, పెరంబూర్, సేలం, నమక్కల్, శివగంగ, మదురై, దిండిగల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.