YS Jagan Cabinet 2.0: నేడు కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం, 14 మంది కొత్త ముఖాలకు వైఎస్ జగన్ మంత్రి వర్గంలో చోటు, 11 మంది సీనియర్లకు మరోసారి అవకాశం, మొత్తం 25 మందితో మంత్రి వర్గం ఏర్పాటు
25 మంది కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం (new cabinet to take oath ) చేయించనున్నారు.
Amaravati, April 11: ఆంధ్రప్రదేశ్‌లో నేడు నూతన కేబినెట్ (Cabinet) కొలువుదీరనుంది. 25 మంది కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉదయం 11.31 గంటలకు ప్రమాణ స్వీకారం (new cabinet to take oath ) చేయించనున్నారు. దీనికోసం తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాకు పక్కన ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. 25 మందితో మంత్రివర్గాన్ని (YS Jagan Cabinet 2.0) ఏర్పాటు చేశారు. అయితే ముందుగా చెప్పినట్లు వారందరితో ఈనెల 7న రాజీనామా చేయించారు. కొత్తవారితో నూతన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు.
అయితే 11 మంది సీనియర్లకు మంత్రివర్గంలో మరోసారి అవకాశం ఇచ్చారు. వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్ ఉన్నారు. ఇక కొత్తగా 14 మందిని నియమించనున్నారు. వారిలో ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్‌కే రోజా, ఉషా శ్రీచరణ్‌లు ఉన్నారు.
రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చిత్తూరు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా ముచ్చటగా మూడు మంత్రి పదవులు దక్కించుకుని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఉన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామిని కొనసాగిస్తూ బోనస్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి వర్గంలో చోటుదక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే.. బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు. బీసీల పట్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోసారి అభిమానం చాటుకున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు కేబినెట్‌లో చోటు కల్పించి బీసీల అభ్యున్నతి, స్త్రీ సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించడం ఇదే తొలిసారి.