YSR Housing Scheme: పేదలందరికీ ఇళ్లు పథకానికి హైకోర్టు బ్రేక్, కోర్టు చెప్పిన ముఖ్యమైన కారణాలు ఇవే, తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సొంత గూడు కల్పించాలన్నఉద్దేశంతో తీసుకొచ్చిన ‘పేదలందరికీ ఇళ్లు’ (YSR Housing Scheme) పథకానికి హైకోర్టు (Andhra Pradesh High Court) బ్రేక్ వేసింది. ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని (Don't force Jagan's housing scheme beneficiaries to construct houses) స్పష్టంచేసింది.
Amaravati, Oct 9: ఏపీ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ సొంత గూడు కల్పించాలన్నఉద్దేశంతో తీసుకొచ్చిన ‘పేదలందరికీ ఇళ్లు’ (YSR Housing Scheme) పథకానికి హైకోర్టు (Andhra Pradesh High Court) బ్రేక్ వేసింది. ఈ పథకం కింద లబ్దిదారులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని (Don't force Jagan's housing scheme beneficiaries to construct houses) స్పష్టంచేసింది.
25 లక్షల ఇళ్ల పట్టాల మంజూరు నిమిత్తం పలు మార్గదర్శకాలతో 2019 ఆగస్టు 19న ప్రభుత్వం జారీ చేసిన జీవో 367లో... ఇళ్ల పట్టాల కేటాయింపు బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ (బీఎస్‌వో)–21లోని నిబంధనలు, అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్ట నిబంధనల ప్రకారం జరగాలని చెబుతున్న 3వ మార్గదర్శకాన్ని హైకోర్టు చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ కొట్టేసింది.
అలాగే ఇళ్ల పట్టాల మంజూరు విషయంలో అదనపు మార్గదర్శకాలతో 2019 డిసెంబర్ 2న జారీ చేసిన జీవో 488లోని 10,11,12వ క్లాజులను సైతం కొట్టేసింది. మార్గదర్శకాలను సవరిస్తూ 2020 మార్చి 31న జారీ చేసిన జీవో 99లోని క్లాజ్ బీ (కేటాయింపు ధర), క్లాజ్ సీ (ఇంటి నిర్మాణం)లను కూడా చట్ట విరుద్దమంటూ కొట్టేసింది. ఈ చట్టాలు ఒక దానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయంది. లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను కన్వేయన్స్ డీడ్ రూపంలో ఇచ్చిన నేపథ్యంలో ఆ డీడ్‌లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బీఎస్‌వో–21, అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్ట నిబంధనలను అనుసరించి చట్ట ప్రకారం లబ్దిదారులకు డీ–ఫాం పట్టా ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పట్టాలు మహిళలకే ఇవ్వాలన్న జీవో 367లోని 2వ మార్గదర్శకాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తూ దానిని కొట్టేసింది.పట్టాలను అర్హతల ఆధారంగా పురుషులకు, ట్రాన్స్‌జెండర్లకు సైతం ఇవ్వాలంది.
కాగా వైఎస్సార్ హౌసింగ్ స్కీంలో భాగంగా కాలనీల్లో లబ్దిదారులకు మునిసిపల్ ప్రాంతాలైతే ఒక సెంటు, గ్రామ పంచాయతీల పరిధిలోనైతే ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇంటి నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇది ఎంత మాత్రం సరిపోదని హైకోర్టు పేర్కొంది. ‘‘దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. అగ్నిప్రమాదాల నుంచి రక్షణ ఉండదు. తాగునీటి సమస్యలుంటాయి. మౌలిక సదుపాయాలు ఉండవు. మురుగు నీరు కూడా బయటకు వెళ్లదు. ఇళ్ల స్థలాలు కేటాయించే ముందు ప్రభుత్వం ఈ ఇబ్బందుల గురించి అధ్యయనం చేసి ఉండాలి. కానీ ప్రభుత్వం ఈ రోజు వరకు అలాంటి అధ్యయనమేదీ చేయలేదని తెలిపింది.
కరోనా ముప్పు పోయిందనేది అబద్దం, ముందు ముందు పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఈ అధ్యయనం కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ తీర్పు కాపీ అందుకున్న నెల రోజుల్లో ఈ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ తరువాత నెల రోజుల్లో కమిటీ నివేదిక సమర్పించాలి. దాన్ని రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఆ తరువాతనే ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఖరారు చేయాలి’’ అని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
ఖరారుకు ముందు పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యలు, స్థల విస్తీర్ణం పెంపుదల, తగ్గింపు, అవసరమైతే మరింత భూమిని సేకరించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంది. అప్పటి వరకు లబ్దిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి కోర్టు వ్యతిరేకమేమీ కాదని, కానీ కేవలం మహిళలకే కేటాయించడం వివక్ష చూపడమే అవుతుందని హైకోర్టు తెలిపింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి శుక్రవారం 108 పేజీల తీర్పునిచ్చారు. జీవో 367, జీవో 488, జీవో 99లను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన పొదిలి శివ మురళి మరో 128 మంది 2020 డిసెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సత్యనారాయణమూర్తి శుక్రవారం తన తీర్పు వెలువరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆ విధాన నిర్ణయాల విషయంలో న్యాయస్థానాలు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు.
ఇక ఐదేళ్ల తరువాత ఇంటిని అమ్ముకునేందుకు అనుమతినివ్వటాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఐదేళ్ల తరువాత ఇంటిని అమ్ముకునేందుకు అనుమతినివ్వడం పేదలందరికీ ఇళ్లు పథకం ఉద్దేశానికి వ్యతిరేకమన్నారు. ఇంటిని అమ్ముకునేందుకు అనుమతినివ్వడం వల్ల ఐదేళ్ల తరువాత ఆ ఇంటి యజమాని తిరిగి ఇల్లు లేని వ్యక్తి అవుతారన్నారు. ఇది పేదలందరికీ ఇళ్ల పథకం ఉద్దేశం ఎంత మాత్రం కాదన్నారు. ఇళ్లు లేని వ్యక్తుల ప్రయోజనాన్ని ఆశించి తీసుకొచ్చిన నిబంధన ఎంత మాత్రం కాదన్నారు. అందువల్ల జీవో 488లోని 10,11,12 మార్గదర్శకాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి కొట్టేస్తున్నట్లు తన తీర్పులో తెలిపారు.
దీంతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలన్నారు. ‘‘అత్యధికులు సరైన వాతావరణం ఉన్న ఇళ్లలో ఉండటం లేదు. ఇలాంటి వారంతా కూడా ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు పలు రిస్క్‌లు ఎదుర్కొంటున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే ముందు ప్రభుత్వం ఈ రిస్క్‌లను పరిగణనలోకి తీసుకోలేదు. అంతేకాక ప్రభుత్వం కేటాయించిన ఈ ఒక సెంటు భూమి లబ్దిదారుల పిల్లల ఉద్దరణకు ఎంత మాత్రం సరిపోదు. పిల్లలు సరైన ఇంటిలో పెరగకపోవటం మానవ హక్కుల ఉల్లంఘనే. లబ్దిదారుల భవిష్యత్తును, మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, విద్యా, భావోద్వేగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తగిన వసతిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం అలాంటి వాతావరణం లేని ఇళ్లను ఇస్తూ పేదల భవిష్యత్తును సమాధి చేస్తోంది. ఇరుకైన ఇళ్లలో నివాసం ఉండటంతో పలు అంశాల్లో వారి అభివృద్ధి, పురోగతి మృగ్యమైపోతుంది. చిన్న ఇంటిలో పిల్లలు, వృద్ధులు స్వేచ్ఛగా తిరిగేందుకు ఆస్కారం ఉండదు.’ అని జస్టిస్ సత్యనారాయణ అన్నారు.
అప్పీల్‌కు నిర్ణయం
ఈ తీర్పుపై ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పేదలందరికీ ఇళ్ల పథకంలోని సదుద్దేశాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో ఈ తీర్పు విఫలమైందని ధర్మాసనానికి నివేదించనుంది. ఈ తీర్పు వల్ల లక్షల మంది లబ్దిదారులు ఇబ్బంది పడతారని, అందువల్ల దీనిపై స్టే ఇవ్వాలని కోరనుంది.
పెళ్లి కాని పురుషులు, భార్య చనిపోయిన వారు, పిల్లలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలు పొందేందుకు అనర్హులవుతారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘‘ఇల్లు కేటాయించిన మహిళ భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పుడు ఆ భర్త ఇల్లు లేని వ్యక్తి అవుతాడు. ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. మహిళలకు మాత్రమే ఇంటి స్థలం మంజూరు చేయడం వివక్ష చూçపడమే. ట్రాన్స్‌జెండర్లు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు.
యాచన చేస్తూ, ఎలాంటి వసతి లేకుండా బతుకుతున్నారు. సమాజం నుంచి వారు చాలా అవమానాలను ఎదుర్కొంటుంటారు. స్త్రీ, పురుషులతో సమానంగా వీరికీ హక్కులున్నాయి. ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల స్థలాన్ని తిరస్కరించడం రాజ్యాంగ ఉల్లంఘనే. అందువల్ల మహిళలతో పాటు పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు సైతం స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ ఇళ్ల పథకం ఉద్దేశం ఇళ్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడమే తప్ప, మహిళలకు ఇవ్వడమన్నది కాదు. ఇళ్ల స్థలాలను కేవలం మహిళలకే ఇవ్వడంలో ఎంత మాత్రం హేతుబద్ధత లేదు. 100 శాతం మహిళలకే కేటాయించడం సమానత్వపు హక్కును హరించడమే’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.