New Delhi, October 7: రైల్వే ప్రయాణికులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. ఇకపై రైల్వే స్టేషన్లలో కాని లేక ప్రయాణ సమయంలో కాని మాస్క్ ధరించకుంటే రూ. 500 జరిమానా విధించనుంది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వశాఖ గురువారం కొవిడ్ సంబంధిత మార్గదర్శకాలను మరో ఆరు నెలలు (Indian Railways Extends COVID-19 Guidelines) పొడగించింది. స్టేషన్లతో పాటు రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా (Imposed Rs 500 Fine on Passengers Found Without Masks) విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఇండియన్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రయాణానికి ముందు తప్పనిసరిగా ఆయా రాష్ట్రాలు జారీ చేసిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకోవాలని రైల్వేశాఖ సూచించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ దేశంలో కొత్తగా 22,431 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. ఇందులో 3,32,00,258 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వైరస్‌తో ఇప్పటి వరకు 4,49,856 మంది మృతిచెందగా, ప్రస్తుతం దేశంలో 2,44,198 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కరోనా ముప్పు పోయిందనేది అబద్దం, ముందు ముందు పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
దేశంలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుతున్నా.. మహమ్మారిపై ఇంకా పోరాటం ముగియలేదని కేంద్రం పేర్కొన్నది. సగటున రోజుకు దేశంలో 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, ఇందులో 56శాతం కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, మిజోరాం, కర్ణాటకలో 10వేల కంటే ఎక్కువ యాక్టివ్ కేసులున్నాయని చెప్పారు.
అరుణాచల్‌ప్రదేశ్, అసోంలోని కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం మధ్య ఉందని, తొమ్మిది రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో పదిశాతాని కంటే ఎక్కువ వీక్లీ పాజిటివిటీ రేటు నమోదువుతుందన్నారు. లక్షద్వీప్, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, సిక్కిం తన జనాభాలో కొవిడ్ టీకా మొదటి డోస్ వేసినట్లు లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.