MLA Ambati Rambabu: ఏపీలో పెగాసస్ స్పైవేర్ ప్రకంపనలు, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు బయటకు వస్తున్నాయని వెల్లడి
పెగసెస్ చంద్రబాబు (Chandrababu Naidu) వాడినట్లు మమత బెనర్జీ చెప్పారు.. ఆమె మా రాజకీయ మిత్రురాలు కాదని అన్నారు.
Amaravati, Mar 18: ఏపీలో వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ (Pegasus Spyware) ప్రకంపనలు రేపుతోంది. వివాదాస్పద పెగాసస్ స్పైవేర్‌పై కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పెగసస్ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు.
ఈ విషయంపై శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు (MLA Ambati Rambabu) మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే టెక్నాలజీకి ఆద్యుడ్ని అని ప్రచారం చేసుకునే చంద్రబాబు దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని ఆరోపించారు. పెగసెస్ చంద్రబాబు (Chandrababu Naidu) వాడినట్లు మమత బెనర్జీ చెప్పారు.. ఆమె మా రాజకీయ మిత్రురాలు కాదని అన్నారు. చంద్రబాబు, మమతా బెనర్జీ కొంతకాలం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కలిసి ప్రచారం చేసిన వారేనని గుర్తు చేశారు.
ఇప్పుడేమో గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. మేమేమి మీరు పెగసస్ వాడారని చెప్పలేదు.. ఇలా భుజాలు తడుముకుంటున్నారంటే దీనిలో ఏదో ఉందని అన్నారు. లోకేష్ తిండి ఖర్చులకు రూ. 30 లక్షలు వాడారని రాస్తే సాక్షిపై కేసు వేశారు. మరి ఇప్పుడు మమత బెనర్జీపై కేసు వేస్తారా? అని ప‍్రశ్నించారు. ఈ దేశంలో అనైతిక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని విమర్శించారు.
చంద్రబాబు జీవితమంతా అనైతిక రాజకీయాలేనన్నారు. నాడు చంద్రబాబు ట్యాపింగ్ కార్యక్రమాలకు పాల్పడలేదా అని ప‍్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. పెగాసస్‌పై విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. దీంతో వెంటనే పెగాసస్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఏబీ వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు కూడా ప్రాథమికంగా భావించింది. 23 మంది శాసన సభ్యులను తీసుకెళ్లడానికి చంద్రబాబు పోలీసులను వాడుకోలేదా...? ఏబీ వెంకటేశ్వర రావు దీనికి ప్రధాన భూమిక పోషించలేదా...? అధికారికంగా కొనకపోతే ప్రయివేటుగా కొనుగోలు చేసి ఉంటారు.. రూ. 25 కోట్లు పెట్టి ప్రైవేటుగా కొని ఉంటారు.. వెళ్లెప్పుడు వాటిని నాశనం చేసి ఉంటారని అన్నారు. మేము ప్రత్యర్థుల వీక్ నెస్‌పై ఆధారపడి రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు.