New Delhi, October 27: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్కామ్‌పై (Pegasus Spyware Leak Case) సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. పెగాసస్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, గోప్యత హక్కును కాపాడుకోవడం చాలా ముఖ్యమని సుప్రీం ( Supreme Court) తేల్చి చెప్పింది. అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ.. ఏడు అంశాలపై దర్యాప్తు చేయనుంది.
చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని సుప్రీంకోర్టు తెలిపింది. గోప్యత హక్కును కాపాడుకోవడం ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్ ప్రత్యక్ష బాధితులని పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వురినియోగంపై పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడాన్ని సహించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిఘాతో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని ధర్మాసనం పేర్కొంది.
పౌరులపై నిఘాలో విదేశీ ఏజెన్సీల ప్రమేయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందని వ్యాఖ్యానించింది. ఆరోపణలపై క్షుణ్ణంగా పరిశీలించి ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. కాగా, కమిటీ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. జాతీయ భద్రత పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది.