New Delhi, July 20: దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన ‘పెగాసస్’ హ్యాకింగ్ (Pegasus Leak) బాధితుల జాబితాలో మరికొందరి రాజకీయ నేతలపేర్లు బయటపడ్డాయి! కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో (Rahul Gandhi, Prashant Kishor) పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఫోన్లు, ప్రహ్లాద్ పటేల్ సన్నిహితులకు చెందిన 18నంబర్లు కూడా హ్యాక్ అయ్యాయని ‘ద వైర్’ వార్తా సంస్థ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది.
ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశీయంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ (Pegasus Leak) చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమున్నాయి.ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 300 మంది భారతీయుల ఫోన్లను ట్యాపింగ్ చేయగా, ఇందులో 40 మంది ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు సమాచారం. వైష్ణవ్ ఆయన భార్య పేరుతో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ల చివరి అంకెలు బహిర్గతమైన రికార్డుల్లో కన్పిస్తున్నాయని వైర్ తెలిపింది.
కేంద్ర ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లావాసా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ప్రముఖ వైరాలజిస్టు గగన్ దీప్ కాంగ్, ఎన్నికల వాచ్‌డాగ్ ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్(ఏడీఆర్)’ వ్యవస్థాపకుడు జగ్‌దీప్ చోఖర్.. ఇలా చాలా మంది పెగాసస్ నిఘా నీడన ఉన్నారని పేర్కొంది. ఎవరెవరి ఫోన్లు ఎప్పుడెప్పుడు హ్యాకింగ్‌కు గురయ్యాయో కూడా తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. రాహుల్ గాంధీపై 2018 మే/జూన్ నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కూడా నిఘా పెట్టారు. రాహుల్ ఉపయోగించిన రెండు నంబర్లతో పాటు ఆయన స్నేహితు ల్లో ఐదుగురికి, పార్టీ విషయాల్లో ఆయనతో సన్నిహితంగా పనిచేసే ఇద్దరు సహాయకులు అలంకార్ సవాయ్, సచిన్‌రావుకు సంబంధించిన తొమ్మిది నంబర్లపై నిఘా పెట్టారు.
ఇదిలా ఉంటే పెగాసస్ హ్యాకింగ్ (Pegasus hacking) వ్యవహారంపై కేంద్రం ఘాటుగా స్పందించింది. హ్యాకింగ్ కథనాలు ఉద్దేశపూర్వకంగా వస్తున్నాయే తప్ప అందులో నిజం లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (IT Minister Ashwini Vaishnaw) అభిప్రాయపడ్డారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం కేంద్రం కుట్రపన్నుతోందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
Here's Congress Party Tweet
It is an attack on the democratic foundations of our country. It must be thoroughly investigated and those responsible be identified and punished. - Shri @RahulGandhi #PegasusProjecthttps://t.co/K0IPpSGArL
— Congress (@INCIndia) July 19, 2021
2019ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన కేసులో ప్రధాని మోదీకి నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా క్లీన్‌చిట్ ఇవ్వడంపై అసమ్మతి వ్యక్తం చేయడం ద్వారా అశోక్ లావాసా వార్తల్లోకి వచ్చారు. అప్పుడే ఆయన ఫోన్‌పై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారు. ఇక ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో ప్రశాంత్‌కిశోర్ ఫోన్‌ను పెగాసస్ స్పై వేర్ ద్వారా హ్యాక్ చేసినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్ నిర్వహించిన డిజిటల్ ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.
వ్యాక్సిన్ తీసుకుని అందరూ బాహుబలులయ్యారు, విపక్షాల ఆందోళన మధ్య ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని మోదీ
ఇక ఇటీవలే కొత్తగా మోదీ కేబినెట్‌లో ఐటీ, రైల్వే శాఖల బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫోన్ కూడా 2017లో హ్యాకింగ్‌కు గురైంది. అప్పుడు ఆయన గుజరాత్‌లో మూడు కంపెనీలకు డైరెక్టర్. టెక్నాలజీకి సంబంధించి మోదీ నిర్ణయాల వెనుక కీలకంగా వ్యవహరించారు. అలాగే.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన స్టాఫర్‌కు, ఆమె బంధువులకు చెందిన 11 నంబర్లపై 2019 ఏప్రిల్‌లో (ఆరోపణలు చేసిన సమయంలో) పెగాసస్ నిఘా ఉన్నట్టు ‘ద వైర్’ వెల్లడించింది. ప్రముఖ వైరాలజిస్టు గగన్ కాంగ్ ఫోన్‌ను 2018లో కేరళను నిఫా వైరస్ కుదిపేస్తున్నప్పుడు హ్యాక్ చేశారట.
తమను విమర్శించేవారిపై మోదీ సర్కారు నిఘా పెట్టిందని.. ఇందుకోసం ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎ్‌సవో రూపొందించిన ‘పెగాసస్’ స్పైవేర్‌ను ఉపయోగించిందని అమెరికాకు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఉగ్రవాద కార్యకలాపాలను పసిగట్టి, చర్య తీసుకునేందుకు ఉపయోగించాల్సిన ఈ నిఘా పరికరాల్ని మోదీ సర్కారు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, మానవహక్కుల సంఘాలపై ప్రయోగించిందని వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టులు జోవాన్నాస్లేటర్, నీహా మహిష్ తమ కథనంలో పేర్కొన్నారు.
Here's Subramanian Swamy Tweet
Strong rumour that this evening IST, Washington Post & London Guardian are publishing a report exposing the hiring of an Israeli firm Pegasus, for tapping phones of Modi’s Cabinet Ministers, RSS leaders, SC judges, & journalists. If I get this confirmed I will publish the list.
— Subramanian Swamy (@Swamy39) July 18, 2021
పెగాసస్ వ్యవహారంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అయిదుసార్లు తాను ఫోన్లు మార్చానని, అయినా ఇప్పటికీ హ్యాకింగ్ కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను ట్యాప్ చేశారని, అలాగే జూలై 14 చివరిసారి ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. కాగా ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆర్ఎస్ఎస్ నేతలు,జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చర‍్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇజ్రాయెల్ కంపెనీ ఎన్‌ఎస్‌వో గ్రూప్ (పెగాసస్‌ను అమ్మేది ఇదే) ఆరోపణల్ని ఖండించింది. నిఘా కార్యకలాపాల కోసమే ఈ స్పైవేర్‌ను ఎన్‌ఎస్‌వో ప్రభుత్వాలకు అమ్ముతుంటుంది. అలాంటిది హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. అయితే లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే యాక్సెస్ ఉండే Pegasus డేటా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే లేదని, తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించింది.
పారిస్‌కు చెందిన ఓ మీడియా హౌజ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ద్వారా ఈ నిఘా కుంభకోణం వెలుగు చూసినట్లు సమాచారం. ఎన్‌ఎస్‌వో గ్రూప్ రూపొందించిన పెగాసస్.. సైబర్‌వెపన్‌గా భావిస్తుంటారు. కానీ, ఐఫోన్ యూజర్లనే ఇది టార్గెట్ చేస్తుందని, హ్యాకింగ్‌కు పాల్పడుతుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఇది ఆండ్రాయిడ్ ఫోన్లను సైతం టార్గెట్ చేస్తుందని తర్వాత తేలింది. పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి ఎన్‌ఎస్‌వో గ్రూప్ మీద ఫేస్‌బుక్ 2019లో ఓ దావా కూడా వేసింది. అంతేకాదు వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేసింది కూడా. ప్రస్తుతం పెగాసస్ కథనాలు పలు ఇంటర్నేషనల్ మీడియా హౌజ్‌లలో కూడా ప్రచురితం అవుతున్నాయి.
పెగాసస్’ స్పైవేర్ ఒక్కసారి మొబైల్ ఫోన్ లోకి చొరబడితే... అది మొబైల్ యజమాని కంటే ఎక్కువ కంట్రోల్ కలిగి ఉంటుంది" అని తెలిపారు. "పెగాసస్ ఐఫోన్ లోకి చొరబడిన క్షణాల్లోనే కీలకమైన అధికారాలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత కాంటాక్ట్ లిస్టు, మెసేజెస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీ వంటి అన్ని విషయాలనూ యాక్సెస్ చేస్తుంది. ఆ విషయాలన్నిటినీ హ్యాకర్‌కి చేరవేస్తుంది" అని తెలిపారు.
జీరో-క్లిక్ అటాక్స్ ఎలా జరుగుతాయి?
మానవ తప్పిదం లేదా మానవ ఇంటరాక్షన్ లేకుండానే జీరో-క్లిక్ సైబర్ అటాక్స్ అనేవి పెగాసస్ వంటి స్పైవేర్లకు మొబైల్‌ని కంట్రోల్ చేయడానికి సహాయ పడుతుంటాయి. నేరుగా సిస్టమ్ పైనే అటాక్ జరుగుతుంది కాబట్టి ఫిషింగ్ అటాక్ గురించి అవగాహన ఉన్నా... లేదా లింక్స్ పై క్లిక్ చేయకూడదు అని తెలిసినా ఎలాంటి ఉపయోగమూ ఉండదు. సాఫ్ట్ వేర్ పైన ఎక్కువగా జరిగే ఈ అటాక్స్ హానికరమైనవా కాదా అనేది నిర్ధారించడానికి సమయం కూడా ఉండదు. చాలా రహస్యంగా ఫోన్ లోకి చొరబడే ఈ స్పైవేర్లను గుర్తించడం కూడా చాలా కష్టం.
ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెక్యూరిటీ సంస్థ జెకాప్స్.. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు మెయిల్ అప్లికేషన్ ద్వారా అన్‌సిస్టెడ్ దాడులను ఎదుర్కొంటాయని తెలిపింది. ఐఫోన్ లలో ఉన్న సెక్యూరిటీ వ్యవస్థ.. రిమోట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యాలకు అనుమతిస్తుందని... కొంత మొత్తంలో మెమరీని వినియోగించే ఈమెయిల్‌ల ద్వారా అటాకర్లకు మొబైల్‌ని రిమోట్‌గా హ్యాక్ చేసే వీలు కల్పిస్తుందని జెకాప్స్ బ్లాగ్ వెల్లడించింది. యాపిల్ వైర్ లెస్ డివైజ్ లింక్ ద్వారా కూడా ఈ దాడులు జరుగుతాయని టెక్నాలజీ నిపుణులు వెల్లడించారు. iOS 13.3.1 సెక్యూరిటీ ప్యాచ్ అప్ డేట్ రిలీజ్ చేసినప్పుడు యాపిల్ సంస్థ మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించామని తెలిపింది. కానీ దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఆండ్రాయిడ్ 4.4.4 వర్షన్, అంతకంటే ఎక్కువ వర్షన్ మొబైల్ ఫోన్ల పై కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉంది. వాట్సాప్, గ్రాఫిక్స్ లైబ్రరీ, స్ట్రీమింగ్ మూవీస్, గేమ్స్ తదితర మార్గాల ద్వారా స్పైవేర్ దాడులు జరుగుతాయి.
జీరో-క్లిక్ అటాక్స్ నిరోధించవచ్చా..?
ఈ సైబర్ దాడులను గుర్తించడమే కష్ట సాధ్యం కాబట్టి నిరోధించడం అనేది దాదాపు అసాధ్యం. మొబైల్ వినియోగదారులు చేయాల్సిందల్లా తమ సెక్యూరిటీ ప్యాచ్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్ యాప్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి మాత్రమే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ దాడుల నుంచి తప్పించుకోవాలంటే.. మీ అప్లికేషన్లను అన్ఇన్స్టాల్ చేసి.. బ్రౌజర్స్ ద్వారా మెయిల్స్, మెసేజెస్ చెక్ చేసుకోండి.
కేంద్ర ఐటీ శాఖమాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్
పెగాసస్ ట్యాపింగ్ కుంభకోణంపై కేంద్ర ఐటీ శాఖమాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ ప్రకారం పెగాసెస్‌ను 45 దేశాలు ఉపయోగిస్తున్నప్పుడు భారతదేశం మాత్రమే ఎందుకు దాడి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులతో సహా భారతదేశంలో 300 మందిఫోన్లను కేంద్రం ట్యాప్ చేసిందన్న ది వైర్ కథనం మోదీ సర్కార్‌ను ఇరుకునపెట్టింది. దీంతో కేంద్ర మాజీమంత్రి కేంద్రప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పనిలో పడ్డారు. కాగా ఫోన్లను ట్యాప్ చేసిన ప్రముఖుల జాబితాలో కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ , అతని ఇద్దరు సహాయకులు ఉన్నారని ది వైర్ నివేదించింది. వీరితో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా కూడా ఉన్నారని తెలిపింది. దీనిపై పార్లమెట్ సమావేశాల ప్రారంభం మొదటి రోజే తీవ్ర దుమారం రేపింది.