New Delhi, July 20: దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు (Covid in India) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 499 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకూ మొత్తంగా 3.11 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. 4,14,108 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,21,665 యాక్టివ్ కేసులున్నాయి. 3,03,08,456 మంది కరోనా (Coronavirus in India) నుంచి కోలుకున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 38,660 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 40.64 కోట్ల మందికి టీకా పంపిణీ (Vaccination in India) చేశారు.
రాబోయే కొద్ది రోజుల్లోనే 7.5 మిలియన్ డోసుల మోడెర్నా కొవిడ్ టీకాలు భారత్‌కు అందనున్నాయి. నష్ట పరిహారం మాఫీతో సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం మోడెర్నా, ఫైజర్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. ప్రభుత్వం సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని, కాంట్రాక్టుపై పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని.. ఈ ప్రస్తుతం చర్చల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఈ విషయంపై కీలక విషయాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలు చోటు చేసుకోకుండా చూసే ఉద్దేశ్యంతో డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన కోవ్యాక్స్ ప్రోగ్రాం కింద.. భారత్‌కు 75 లక్షల మోడెర్నా వ్యాక్సిన్ డోసుల అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు భారత్‌కు ఆఫర్ అందించామని ఆయన చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకుని అందరూ బాహుబలులయ్యారు, విపక్షాల ఆందోళన మధ్య ప్రసంగాన్ని కొనసాగించిన ప్రధాని మోదీ
అయితే ఈ వ్యాక్సిన్ డోసులు భారత్‌కు ఎప్పటికీ చేరుకుంటాయనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యాక్సిన్ లభ్యత ‘ఇండెమ్నిటీ క్లాజు’తో ముడిపడి ఉందని ఖేత్రపాల్ తెలిపారు. కాగా, గత నెల భారత్‌లో మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. అయితే ఈ అనుమతులు పూర్తి స్థాయిలో లభించలేదు. భారత డ్రగ్ ఉత్పత్తి సంస్థ సిప్లా ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుంటుందని, వీటిపై కేంద్ర ప్రభుత్వం పరిశీలన ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఇప్పటికే మోడెర్నా కంపెనీతో చర్చలు జరుపుతున్నామని ఇటీవలే నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో డెల్టా వేరియంట్ ప్రాబల్యం అత్యధికంగా ఉందని తేలింది. దీనివల్లే కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల నమోదవుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల నెమ్మదించడాన్ని ప్రమాద హెచ్చరికగా పరిగణించాలని ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ చేసిన ప్రకటన కూడా మూడోవేవ్ ఇప్పటికే మొదలైందనే దిశగానే సంకేతాలిస్తోంది. వీటన్నింటికి మించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్.. ‘‘ప్రపంచ దేశాలు కరోనా మూడో వేవ్ ప్రాథమిక దశలో ఉన్నాయి’’ అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మనం ఏ దశలో ఉన్నామనేది చెప్పకనే చెప్పాయి.