Kotamreddy Sridhar Reddy: వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బై చెప్పినట్లే, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదని స్పష్టం, ఆడియో టేప్‌పై స్పందించిన సజ్జల

రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో బయట పెట్టారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని తనపై అభిమానం ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించారు.

Kotamreddy Sridhar Reddy (Photo-Twitter)

Amaravati, Feb 1: ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో బయట పెట్టారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని తనపై అభిమానం ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించారు.

కానీ, తాను (YSRCP MLA, Kotamreddy Sridhar Reddy) నమ్మలేదన్నారు. సీఎం జగన్ ను ఇంతగా అభిమానించే, అధికారి పార్టీ ఎమ్మెల్యే అయిన తన ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారని అనుకున్నానని చెప్పారు. తన చిన్ననాటి స్నేహితుడైన ఓ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చిందన్నారు.వచ్చే ఎన్నికల్లో వైకాపా (YSRCP) నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) స్పష్టం చేశారు.

ఏపీ రాజధానిగా విశాఖపట్నం, స్పష్టం చేసిన సీఎం జగన్, ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా విశాఖకు ఆహ్వానిస్తామని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

ఇంటెలిజెన్స్‌ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్‌ ట్యాప్‌ (Phone Tapping) చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. బుధవారం నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు సహా సొంత పార్టీ నేతలను ఉద్దేశించి కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రెస్‌మీట్‌ పెడతానని అనుకోలేదు.

వైఎస్‌కు ఎంత వీరవిధేయుడినో అందరికీ తెలుసు. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎంతో పోరాడా. వైసీపీ అధికారంలోకి వచ్చాక గుర్తింపు లేకపోయినా బాధపడలేదు. పార్టీ గురించి నేనెక్కడా ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదు. నేనెప్పుడూ జనంలోనే ఉన్నా. కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు నాపై నిఘాపెట్టారు.

అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డా. నా ఫోన్‌ ట్యాప్‌ (Kotamreddy Sridhar Reddy Audio Leak) అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్‌ అధికారి చెప్పారు. సీఎంపై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించా. గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్‌ అధికారులు నాపై నిఘా పెట్టారు. అనుమానం ఉన్నచోట ఉండాలని నాకు లేదు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదు. ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు. నన్ను సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారు.

ఇంకో మూడు నెలల్లో విశాఖకు అన్నీ షిఫ్ట్ చేస్తాం, రాజధాని తరలింపుపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని వెల్లడి

నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ఇబ్బంది అవుతుంది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఆయన అన్నారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నా. మంత్రులు, జడ్జిలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్‌ అయిండొచ్చు.

మనసు ఒకచోట.. శరీరం మరోచోట ఉండటం నాకిష్టం లేదు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్‌ ట్యాప్‌ చేస్తే ఎలా ఉంటుంది?సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి ఫోన్లు ట్యాప్‌ చేస్తే వారి స్పందన ఎలా ఉంటుంది? తప్పు చేసి ట్యాపింగ్‌ జరగలేదని చెబుతారా? నేను ఆధారాలు బయటపెడితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తుంది.

కొన్ని రోజుల క్రితం నా బాల్య మిత్రుడితో ఐఫోన్‌లో మాట్లాడా. ఆ విషయాల గురించి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు అడిగారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నాకు ఆడియో క్లిప్‌ పంపారు. ట్యాపింగ్‌ చేశారనడానికి ఇంతకుమించి ఆధారాలేం కావాలి? ఫోన్‌ ట్యాపింగ్‌ కాకుండా ఆడియో క్లిప్‌ ఎలా బయటకు వచ్చింది? రెండు ఐఫోన్ల మధ్య సంభాషణ ట్యాప్‌ చేయకుండా ఎలా వచ్చింది? 98499 66000 నంబర్‌ నుంచి ఆడియో క్లిప్‌ వచ్చింది.. ఆ నంబర్‌ ఎవరిదో చెక్‌చేసుకోండి. ఏసీబీ చీఫ్‌గా ఉన్నప్పటి నుంచి సీతారామాంజనేయులు ఆ నంబర్‌ను వాడుతున్నారు.

నేను ట్యాపింగ్‌ అంటున్నా.. కాదంటే మీరు నిరూపించండి. నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చెప్పండి. ట్యాపింగ్‌పై కేంద్రహోంశాఖు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నా. దేశద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని వారి ఫోన్లను ట్యాప్‌ చేస్తారు. ఫోన్లు ట్యాప్‌ చేస్తే కాపురాలు నిలబడతాయా? ప్రభుత్వ పెద్దలే ఇలా చేస్తుంటే ఇంకెవరికి చెబుతాం. దీనిపై అందరూ ఆలోచించుకోవాలి.

ఫోన్‌ ట్యాపింగ్‌ నిర్ధారణ అయ్యాకే నా ప్లాన్‌ నేను చేసుకుంటున్నా. భవిష్యత్‌ కార్యాచరణ తర్వాత ప్రకటిస్తా. ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదు. పార్టీ నుంచి మౌనంగా వెళ్దామనుకున్నా. నన్ను దోషిగా నిలబెట్టాలని చూశారు.. అందుకే ట్యాపింగ్‌ను బయటపెట్టా. బాలినేని వద్దకు మా తమ్ముడు స్వయంగా వెళ్లలేదు. ఆయన పిలిస్తేనే వెళ్లారు. ఐబీ చీఫ్‌ తనంతట తాను నాతో మాట్లాడారని అనుకోవట్లేదు. పార్టీ పెద్దలు చెబితేనే ఆయన నాతో మాట్లాడారని అనుకుంటున్నా. నేను ఇటీవల సీఎంను కలిసిన సమయానికి ట్యాపింగ్‌ ఆధారం నా వద్ద లేదు.

రాష్ట్రంలో వంద మందికి కేబినెట్‌ హోదా ఉంది. పార్టీ తరఫున నాకు ఏ గౌరవం ఇవ్వలేదు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్నారు. ఐబీ చీఫ్‌ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతారని నేను అనుకోలేదు. ట్యాపింగ్‌ అంశంలో అధికారులను తప్పుబట్టాల్సిన పనిలేదు. ప్రభుత్వ పెద్దలు చెబితేనే ట్యాపింగ్‌ జరుగుతుంది. భవిష్యత్‌ కార్యాచరణ ఏంటని కార్యకర్తలు అడిగారు.. టీడీపీ తరఫున పోటీ చేయాలని ఉందని వారితో చెప్పా. ఈ విషయంలో నిర్ణయం ఆ పార్టీ అధినేత చంద్రబాబుది’’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

శ్రీధర్‌ రెడ్డి వ్యవహారంపై స్పందించిన సజ్జల

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యవహారంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. బుధవారం వైసీపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచ్‌ల సమావేశంలో పాల్గొన్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. కోటంరెడ్డి పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది?.

ఆయనే తన ఉద్దేశాలు చెప్పిన తర్వాత చర్యలు ఏం తీసుకుంటాం?. అయినా.. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌లను కాదు’’ అని సజ్జల స్పందించారు. ఎవరైనా ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని.. పదవి రాలేదని అసంతృప్తి ఉండటం వేరు, బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయటం వేరని సజ్జల వ్యాఖ్యానించారు. అలాగే.. అక్కడి నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఇంకా ఎవరినీ నియమించ లేదన్న సజ్జల.. కొంతమందిని ఎలా లాక్కోవాలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు.

టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ఆడియో టేప్ లీక్

వచ్చే 2024 ఎన్నికల్లో తాను నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. ట్యాపింగ్ అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలు బయటపెడితే ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయన్నారు. మీ అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Sandhya Theatre Stampede Case: వీడియో ఇదిగో, ఇరవై రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన శ్రీతేజ్, అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వం మాకు మద్దతు ఇస్తున్నారని తెలిపిన తండ్రి భాస్కర్

Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్‌