Amaravati, Jan 31: ఏపీ రాజధాని తరలింపుపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్‌లోపే విశాఖపట్నం నుంచి పాలన ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటామని చెప్పారు. భీమిలి రోడ్డులోనే చాలా ప్రభుత్వ ప్రాపర్టీలు, ఐటీ భవనాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
ఏపీ ప్రభుత్వ గెస్ట్ హౌస్ నుంచైనా సీఎం జగన పాలన సాగించవచ్చని సుబ్బారెడ్డి చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖ అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నామని, వీలైనంత త్వరగా న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తామని పేర్కొన్నారు.
ఏపీ కాబోయే పాలనా రాజధాని (Andhra Pradesh Capital) విశాఖపట్నం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ సన్నాహక సదస్సులో.. ఢిల్లీలో మంగళవారం ఆయన పలు కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘మా రాజధాని విశాఖే’ అని ప్రకటించారు. రాబోయే రోజుల్లో మా రాజధానిగా మారనున్న విశాఖపట్నంకు.. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రాబోయే నెలల్లో నేనూ విశాఖపట్నంకు (AP Capital shift to Visakhapatnam) మారబోతున్నాను అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే మార్చి 3, 4వ తేదీల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ జరగనుందని ఆయన తెలియజేశారు. తన పిలుపును ఆహ్వానంగా భావించి అక్కడికి రావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తూనే.. అక్కడ జరుగుతున్న వ్యాపారాభివృద్ధిని తోటి ఇన్వెస్టర్లకు తెలియజెప్పాలని సీఎం జగన్ కోరారు.
విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తామని గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా పలు మార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరే నగరానికి లేనంత విశిష్టత, చారిత్రక నేపథ్యం, భౌగోళిక సౌరుప్యం, రవాణా సౌకర్యాలు విశాఖకు ఉన్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన విశాఖపట్నంను రాజధానిగా చేస్తే దాని వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని ఇప్పటికే ఎంతో మంది చెప్పారు. దేశంలోని అభివృద్ధి చెందిన టాప్ 10 నగరాల్లో ఒకటైన విశాఖ హైఎండ్ ఐటీ హబ్‌గా ఎదిగేందుకు ఆస్కారం చాలా ఉంది.