MP Raghurama Krishna Raju: రఘురామ వాట్సప్ దుమారం, సుప్రీంకు కీలక ఆధారాలను సమర్పించిన ఏపీ సీఐడీ, రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీల ఫిర్యాదు, రాజీనామా చేసే ప్రసక్తే లేదని తెలిపిన వైసీపీ రెబల్ ఎంపీ
సుప్రీంకోర్టుకు ఏపీ సీఐడి (AP CID) పలు కీలక ఆధారాలను అఫిడవిట్ లో నివేదించింది. ఎంపీ రఘురామను గత మే నెలలో ఏపీ సీఐడి అరెస్ట్ చేసిన సంగతి విదితమే. దర్యాప్తులో భాగంగా ఆ సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐడి తెలిపింది.
Amaravati, July 20: వైసీపీ రెబల్ ఎంపీ కథ రోజుకు మలుపు తిరుగుతోంది. సుప్రీంకోర్టుకు ఏపీ సీఐడి (AP CID) పలు కీలక ఆధారాలను అఫిడవిట్ లో నివేదించింది. ఎంపీ రఘురామను గత మే నెలలో ఏపీ సీఐడి అరెస్ట్ చేసిన సంగతి విదితమే. దర్యాప్తులో భాగంగా ఆ సెల్‌ఫోన్ కాల్‌డేటాను విశ్లేషించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐడి తెలిపింది. ఇదే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు (Supreme Court) ఇటీవల సమర్పించిన అఫిడవిట్‌లో సీఐడీ అధికారులు సవివరంగా నివేదించారు. 230 పేజీల ఆ అఫిడవిట్ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించారు.
ఇందులో సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా చంద్ర బాబు, లోకేశ్, రఘురామకృష్ణరాజు (YSRCP Rebel MP Krishnam Raju), టీడీపీ అను కూల మీడియా ఏబీఎన్–ఆంధ్రజ్యోతి, టీవీ 5తో సాగించిన సంభాషణలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా వ్యవహరించారని, కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందు కు ఆయన ప్రయత్నించారని ఆరోపణలతో గత మేనెలలో సీఐడీ ఎంపీని అరెస్ట్ చేసింది.ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడకూడదని ఆంక్షలతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో ఆయన సీఎం జగన్ కు లేఖలు రాస్తూ వస్తున్నారు. తాజగా ఏపీ సీఐడీ పలు కీలక విషయాలను అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంలో చంద్రబాబు స్వయం గా రఘురామకృష్ణరాజుతో వాట్సాప్‌లో చాటింగ్ చేశారని అందులో తెలిపింది. అలాగే క్రిస్టియన్, రెడ్డి సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని రఘురామకృష్ణరాజు చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్–ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కలసి కుట్రలకు పాల్పడ్డారని సీఐడీ పేర్కొంది. ఏబీఎన్ ఛానల్ రఘురామకృష్ణరాజు కోసం రచ్చబండ పేరుతో ఏకంగా ఓ కార్యక్రమాన్నే రూపొందించిందని తెలిపింది.
దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు వేదికలైన ఈ రెండు టీవీ ఛానళ్లు మీడియా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని రక్షణ పొందలేవని సీఐడీ అఫిడవిట్‌లో పేర్కొంది. మీడియా స్వేచ్ఛను సాకుగా చూపి రక్షణ పొందేం దుకు పిటిషనర్లకు అనుమతినివ్వొద్దని, దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నాలను అనుమతించవద్దని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సీఐడీ నమోదు చేసి న ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ ఆమోద బ్రాడ్ కాస్టింగ్ (ఏబీఎన్ ఆంధ్రజ్యోతి), శ్రేయా బ్రాడ్ కాస్టింగ్ (టీవీ 5) దాఖలు చేసిన పిటిషన్లను కొట్టే యాలని, దర్యాప్తునకు సహకరించేలా వారిని ఆదేశించాలని కోరింది.
టీవీ 5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, రఘురామకృష్ణరాజులకు మధ్య డబ్బు బదిలీ జరి గిందని సీఐడీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. దాదాపు రూ.8.81 కోట్లు (1 మిలియన్ యూరో లు) టీవీ 5 బీఆర్ నాయుడు నుంచి రఘురామ కృష్ణరాజుకు బదిలీ అయ్యాయని సీఐడీ తెలిపింది. ఏ కంపెనీ పేరు మీద, ఏ బ్యాంకులో ఆ డబ్బు జమ అయిందో కూడా సీఐడీ ఆధారాలతో సహా సుప్రీం కోర్టుకు నివేదించింది.
సీఐడీ దర్యాప్తులో భాగంగా రఘురామరాజు వివిధ సందర్భాల్లో మాట్లాడిన 45 వీడియోలను విశ్లేషించారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీలకు పంపించి నివేదిక తెప్పించుకున్నారు. చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్–ఆంధ్రజ్యోతి, టీవీ 5 యాజమాన్యాలు, ఆ సంస్థ ప్రతినిధులతో జరిపిన వేలాది చాటింగ్‌లను నిశితంగా పరిశీలించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో లోకేశ్, టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులతో చర్చించి పక్కాగా కుట్రపన్ని రఘురామకృష్ణరాజు వ్యవహరించారని సీఐడీ అధికారులు నిర్ధారించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రఘురామకృష్ణరాజు, ఏబీఎన్–ఆంధ్రజ్యోతి, టీవీ 5 యాజమాన్యాలు ఆరు విధాలుగా క్రిమినల్ కుట్రలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు నిర్ధారిస్తూ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
స్పందించిన రఘురామ
దీనిపై రఘురామ స్పందించారు. చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే తనకే ఎక్కువ పాప్యులారిటీ ఉందని, అందుకే మీడియా సంస్థలు తనకు మిలియన్ల కొద్దీ యూరోలు ఇచ్చి మరీ తనతో మాట్లాడించుకుంటున్నాయంటూ ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్ని ఓ మీడియా సంస్థ నుంచి రఘురామరాజు మిలియన్ యూరోలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూరోలలో తనకు డబ్బులు చెల్లించారన్న దానిపై మాట్లాడుతూ.. డబ్బుల బదిలీల అలవాటున్నవారు బహుశా యూరోలలో తనకు బదిలీ చేసి ఉంటారని, అందుకే ఆ పదాన్ని ప్రయోగించి ఉంటారని ఎద్దేవా చేశారు.సాధారణంగా అందరూ అడిగి మరీ మీడియాలో తమ వార్తలు వేయించుకుంటారని, కానీ తనకే ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొందని, ఇలా ఎందుకు దిగజారిపోతారో తనకు తెలియదని అన్నారు.
ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ప్రభుత్వం తనపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. అఫిడవిట్‌లో తనపై మోపిన అభియోగాలన్నీ పసలేనివేనని కొట్టిపడేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి చాలా నిస్పృహలో ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టేసి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ వాటికి ప్రత్యేక హోదా, పోలవరం నిధుల ముసుగు వేస్తున్నారని రఘురామ రాజు మండిపడ్డారు.
వైసీపీ ఎంపీలు, నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన నేను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. నా లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం అసాధ్యం. నేను పార్టీ క్రమశిక్షణారాహిత్యానికి, ఉల్లంఘనలకు పాల్పడలేదు. నేను రాజీనామా చేసినట్లు వస్తున్న వదంతులను నమ్మకండి’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తనకు కొన్చి టీవీ చానెళ్లు, కొందరు వ్యక్తులు మిలియన్ యూరోలు ఇచ్చినట్లు, ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నట్లు దిగజారుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
స్పీకర్ జారీ చేసిన నోటీసుకు త్వరలోనే వివరణ ఇస్తానన్నారు. సోమవారం రాజ్యసభలో ప్రధాని సమక్షంలోనే విజయసాయిరెడ్డి దురుసుగా వ్యవహరించారన్నారు. లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలు చేపట్టే ఆందోళనకు తనకు ఆహ్వానం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో ఒక సామాజిక వర్గానికే కీలకమైన పదవులు కట్టబెట్టి, సామాజిక న్యాయం చక్కగా పాటించారని ఎద్దేవా చేశారు.
బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనం