New Delhi, July 19: లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన (YSRCP MPs Protest in Parliament) కు దిగారు. పోలవరంపై చర్చకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు (YSRCP MPs) పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. వాయిదా తీర్మానానికి ఎంపీ మిథున్ రెడ్డి నోటీసు ఇచ్చారు.
ఇక పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినా.. కేంద్రం పటించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సోమవారం.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి.. పోలవరం ప్రాజెక్ట్ అంశం మీద లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.
ఇక రాజ్యసభలో ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఛైర్మన్ పోడియం వద్దకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
Here's Protest Video
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ రాజ్యసభలో ఆందోళన చేపట్టిన వైయస్ఆర్ సీపీ ఎంపీలు. @VSReddy_MP pic.twitter.com/BkSXW6Vibw
— YSR Congress Party (@YSRCParty) July 19, 2021
కాగా, ప్రత్యేక హోదాపై వెంటనే చర్చ జరపాలంటూ.. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (YSSRCP MP Vijayasaireddy) నోటీసు ఇచ్చారు. ఈ అంశం ఎందుకు అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదో విజయసాయి రెడ్డి తన నోటీసులో క్లుప్తంగా వివరించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర మంత్రివర్గం చేసిన తీర్మానం ఏడేళ్ళు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు రాజ్యసభలో ఇతర కార్యకలాపాలను సస్పెండ్ చేసి ప్రత్యేక హోదా అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు రూల్ 267 కింద విజయసాయిరెడ్డి నోటీసును అందించారు. అయితే ఈ నోటీసుపై ఇప్పటికిప్పుడు చర్చకు అనుమతించేందుకు నిరాకరిస్తున్నట్లుగా సభాధ్యక్షులు ప్రకటించడంతో విజయసాయిరెడ్డి సభలోని వెల్‌లోకి దూసుకువెళ్లారు.
ఆయనతోపాటు వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టిన ఇతర పార్టీ సభ్యులు వెల్‌లోకి చేరుకుని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ నోటీసులో ప్రస్తావించిన ప్రత్యేక హోదా అంశం చర్చకు అర్హమైనదే. కానీ ఈ రోజు చర్చకు అనుమతించలేను’’ అని తెలిపారు. సభలో విజయసాయిరెడ్డితో పాటు ఇతర పార్టీ సభ్యులు వెల్‌లో ఆందోళన చేస్తున్న సమయంలో సభలో ఉన్న ప్రధానమంత్రి మౌనంగా వారిని వీక్షిస్తూ కనిపించారు.