Sankranti Traffic: సంక్రాంతి రద్దీ.. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఒక్క రోజే 67 వేలకు పైగా వాహనాల పరుగులు
పండుగ కోసం లక్షలాదిమంది జనం నగరాన్ని వీడారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 67,577 వాహనాలు రాకపోకలు సాగించాయి.
Hyderabad, Jan 15: పెద్ద పండుగ సంక్రాంతి (Sankranti) కోసం వలస జీవులు సొంతూళ్ల బాట పట్టడంతో హైదరాబాద్ రోడ్లన్నీ (Hyderabad Roads) ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పండుగ కోసం లక్షలాదిమంది జనం నగరాన్ని వీడారు. పండుగ రద్దీని తట్టుకునేందుకు తెలుగు రాష్ట్రాల (Telugu States) ఆర్టీసీ బస్సులతో (RTC Buses)పాటు రైల్వే శాఖ (Railway) కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి అదనంగా సొంత వాహనాల్లో సొంతూళ్లకు వెళ్లిన వారు కోకొల్లలు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై (National Highway) శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 67,577 వాహనాలు రాకపోకలు సాగించాయి.
యాదాద్రి భువనగరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా మీదుగా ఈ వాహనాలు రాకపోకలు సాగించినట్టు రాచకొండ పోలీసులు తెలిపారు. మొత్తం వాహనాల్లో దాదాపు ముప్పావు వంతు అంటే 53,561 కార్లు ఉండగా, 1,851 ఆర్టీసీ బస్సులు, 4,906 ప్రైవేటు ట్రావెల్ బస్సులు, 7,259 ఇతర వాహనాలు ప్రయాణించాయి. సంక్రాంతి సందర్భంగా ఇన్ని వాహనాలు ప్రయాణించడం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. చాలా వరకు వాహనాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి టోల్ ప్లాజా దాటి వెళ్లాయి. తిరుగు ప్రయాణంలోనూ ఇంతే రద్దీ ఉండే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.