Gruha Jyothi-Aadhar Link: ఆధార్ ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిచ్చే ‘గృహజ్యోతి’ స్కీమ్.. విద్యుత్తు కనెక్షన్ నంబర్ కు ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి.. ఆధార్ లేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.. మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
ఆధార్ కార్డు ఉన్నవారికే అందుతుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
Hyderabad, Feb 17: 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇచ్చే గృహజ్యోతి పథకం (Gruha Jyothi Scheme).. ఆధార్ కార్డు (Aadhar Card) ఉన్నవారికే అందుతుందని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. విద్యుత్తు కనెక్షన్ నంబర్ ను, లబ్ధిదారుల ఆధార్ తో అనుసంధానం చేయనున్నట్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామని చెప్పింది. ఆధార్ లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించింది. అథెంటిఫికేషన్ చేసే సమయంలో ఆధార్ ఎన్ రోల్ మెంట్ నంబర్ చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
కొత్తగా ఆధార్ అప్లై చేసుకునే వాళ్లు ఇలా చేయాలి
గృహజ్యోతి పథకం కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి అని సర్కారు చెబుతున్నది. దీని కోసం ఆధార్ కి అప్లై చేసుకోవాలి. శాశ్వత ఆధార్ నంబర్ వచ్చే వరకు ఆధార్ ఎన్ రోల్ మెంట్ నంబర్ ను అధికారులకు చూయించవచ్చు. దీనికి తోడు ఫొటో ఉన్న బ్యాంక్ పాస్ బుక్, పాన్, పాస్ పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రంలో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని సర్కారు పేర్కొన్నది.
వేలిముద్రలు కూడా
ఆథెంటిఫికేషన్ సమయంలో వేలిముద్రలు తీసుకుంటారని, బయోమెట్రిక్ పనిచేయకపోతే ఐరిస్ ద్వారా ప్రయత్నిస్తారని కూడా సర్కారు తెలిపింది. అదికూడా పనిచేయని పక్షంలో ఓటీపీ ద్వారా ఆథెంటిఫికేషన్ చేస్తారని, అదీ కాకపోతే ఆధార్ ధ్రువీకరణ పత్రం తీసుకుంటారని వివరించింది.