Bank Timings Changed in TS: తెలంగాణలో బ్యాంకుల పని వేళల్లో మార్పులు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవలు అందుబాటులోకి, జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త పని వేళలు
రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై బ్యాంకుల పని వేళలపై సమీక్షించింది. లాక్‌డౌన్ సమయం సడలింపుతో (lockdown Extension) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
Hyderabad, May 31: తెలంగాణలో లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో బ్యాంకుల పని వేళల్లో స్వల్ప మార్పులు (Bank Timings Changed in TS) చోటు చేసుకున్నాయి. రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై బ్యాంకుల పని వేళలపై సమీక్షించింది. లాక్‌డౌన్ సమయం సడలింపుతో (lockdown Extension) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. మారిన బ్యాంకు వేళలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్గదర్శకాలు జూన్ 9 వరకు అమల్లో ఉండనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నేటి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. జూన్ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో మ. ఒంటి గంట తర్వాత లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. అన్ని రకాల ప్రజా రవాణాకు మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులుబాటు కల్పించారు.
ఈ గంట సమయంలోనే అందరూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి. 2 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు సీజ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నారు. ఈ మార్గదర్శకాలు జూన్ 9వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. నిన్నటి వరకు కేవలం నాలుగు గంటలు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉండేది.