Hyderabad, May 30: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి నివారణకు లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం విదితమే. అయితే ఈ లాక్‌డౌన్ రేపటి నుంచి(మే 31) మరో పదిరోజుల పాటు కొనసాగించాలని (Telangana Lockdown Extension) కేబినెట్ నిర్ణయించింది. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మరో పది రోజులు లాక్‌డౌన్ (Telangana Lockdown Extended) అమలు కానుంది.
లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరడానికి మరో గంట పాటు అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. నేటి వరకు రోజుకు 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇవ్వగా, ఆ సమయాన్ని మరో మూడు గంటల పాటు పొడిగించారు.
కాగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ భేటీలో తెలిపారు. ఇక కరోనా నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికి.. ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తే కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ రోజూ సరాసరి దాదాపు మూడు వేలకు పైగా కేసులు నమోదవుతుండటం, బ్లాక్‌ఫంగస్ బాధితులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ను కొనసాగించడమే మేలని అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాలు వెల్లడించినట్లు సమాాచారం. కాగా లాక్‌డౌన్ పొడిగింపునకు సంబంధించి మార్గదర్శకాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి.