Telangana Report: తెలంగాణలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదు, 1009కి చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య; ప్రైవేట్ టెస్టులకు అనుమతి లేదు, మే 8 నాటికి రాష్ట్రం కరోనా రహితంగా మారుతుందని మంత్రి ఈటల వెల్లడి

May 8 వరకు తెలంగాణ రాష్ట్రం కరోనా ఫ్రీ అవుతుందని , రోజువారీ పని చేసుకొని బ్రతికేవాళ్ళంతా మళ్ళీ సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను" అంటూ .....

Telangana Health Minister Etela Rajender | File Photo

Hyderabad, April 29:  తెలంగాణలో కొత్తగా మరో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఈ 6 కూడా మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 1009 కి చేరింది. కాగా, ఈ వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న 42 మంది బాధితులను వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 374 మంది కోవిడ్ బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కొత్తగా మరణాలేమి నమోదు కాకపోవటంతో మరణాల సంఖ్య 25 గానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 610 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హెల్త్ బులెటిన్లో పేర్కొంది.

తెలంగాణలో కరోనావైరస్ కట్టడి, ప్రస్తుతం రాష్ట్రంలో చేస్తున్న టెస్టుల విధానాన్ని రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ మీడియాకు వివరించారు. టెస్టులు తక్కువగా చేస్తున్నారన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేయాలని ICMR మార్గదర్శకాలు ఇచ్చింది, ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటున్నామని వివరించారు. కేసుల సంఖ్య దాచే అవసరం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో అంశాల్లో తెలంగాణ బెస్ట్ అని నిరూపించిందని, ఈరోజు కేరళ తర్వాత మంచి వైద్యం తెలంగాణలో అందుతుందని చెప్పారు. ఇక్కడి ప్రజలు గట్టిగా ఉంటారు కాబట్టే వైరస్ ప్రభావం తక్కువగా ఉందని మంత్రి అన్నారు. ఇతర రాష్ట్రాల వారు తెలంగాణలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని భావిస్తే, ఇక్కడున్న వారికి అవి కనిపించడం లేదని విమర్శించారు. మే 8 నాటికి కరోనావైరస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని మంత్రి ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.

 Health Minister Eatala Rajender's Breif 

ఆయన మాట్లాడుతూ.. "రాజకీయాలు అన్ని సందర్భాలలో తగవు, చావుకు వేరే డప్పు ఉంటుంది, పెళ్ళికి వేరే డప్పు ఉంటుంది. కేంద్రం అన్ని విషయాల్లో మమ్ముల్ని ప్రశంసించింది, సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది. రాష్ట్రానికి కరీంనగర్ ఆదర్శం అయితే దేశానికి తెలంగాణ ఆదర్శం. మర్కజ్ విషయాన్ని దేశానికి తెలియజేసింది తెలంగాణనే. కేసులు తగ్గడం శుభసూచకమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిని కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. లెక్కలు తప్పు చెప్తున్నారంటూ కురచగ మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మరు. విమర్శలు చేసే నాయకులకు విజ్ఞత ఉంటే ప్రజలకు భరోసా కల్పించండి కానీ భయాందోళనలకు గురిచేయవద్దు" అని అన్నారు.

రాపిడ్ టెస్ట్ లకు తెలంగాణ మొదటి నుండి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు కేంద్రం కూడా రాపిడ్ టెస్ట్ ల ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నది అంటే మనం ఎంత ముందుచూపుతో ఉన్నామో అర్థం చేసుకోండి. ప్రైవేట్ లో కూడా కరోనా నిర్ధారణ టెస్ట్ లకు అనుమతించం.  కరోనా టెస్టులు ఉచితంగా చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన తరువాత ఏ ఒక్క ప్రైవేట్ హాస్పిటల్, ల్యాబ్ కూడా ముందుకు రావడం లేదంటే వారి ఆలోచన ఏంటో అర్థం చేసుకోవాలని ఈటల తెలిపారు.

"లాక్డౌన్ ను పకడ్బందీగా అమలుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ, ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ఈ లాక్ డౌన్ నుండి తెలంగాణ త్వరగా బయటపడాలని ఆశిస్తున్నా. 46 రోజులుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ యంత్రాంగం అంతా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. ఆదాయం పోయినా ప్రజల ప్రాణాలే ముఖ్యం అని లాక్ డౌన్ కొనసాగిస్తూ కష్టపడుతున్నాం.

ప్లాస్మా థెరపీకి అనుమతి వచ్చింది, ప్రపంచంలో అందుబాటులో ఉన్న ప్రతీ టెక్నాలజీని వాడుకుంటున్నాం. కరోనా వల్ల చావులు తక్కువ వ్యాప్తి ఎక్కువ అందుకే ప్రజలు భయపడుతున్నారు. మన ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంది అందుకే తట్టుకోగలుగుతున్నాం. May 8 వరకు తెలంగాణ రాష్ట్రం కరోనా ఫ్రీ అవుతుందని , రోజువారీ పని చేసుకొని బ్రతికేవాళ్ళంతా మళ్ళీ సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను" అంటూ మంత్రి ఈటల సుదీర్ఘ వివరణ ఇచ్చారు.