Serve The Village: తెలంగాణ పల్లెలన్నీ బాగుపడాలి! గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్లేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్య, తెలంగాణ గ్రామీణాభివృద్ధిపై అధికారులకు సమగ్రమైన మార్గదర్శకాలు జారీ

జూన్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. ఉద్యమ స్పూర్తితో పచ్చదనం పెంచే కార్యక్రమం సాగాలి...

Telangana CM KCR | File Photo

Hyderabad, June 17:  అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇన్ని అనుకూలతలున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపోతే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతీ గ్రామం ప్రతీ రోజు శుభ్రం కావాల్సిందేనని, ముఖ్యమంత్రి సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని సీఎం స్పష్టం చేశారు. రాబోయే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులు చేయాలని, ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని సీఎం చెప్పారు.

జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, రాష్ట్ర డిజిపి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.

గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధి హామీ పథకం, హరితహారం – అడవుల పునరుద్ధరణ, పల్లె ప్రగతి – గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, రైతుబంధు – రైతువేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ల ఏర్పాటు, కరోనా – అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులకు మార్గదర్శకం చేశారు.

ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

• కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకుని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు భర్తీ చేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతీ నెలా 308 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలకు అదనపు నిధులిచ్చి, ఐదు లక్షలకు చేరుకునేట్లు చేస్తాం.

• గ్రామ పంచాయతీలకు రూ.3,694 కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులు, రూ.5,885 కోట్ల నరేగా నిధులు, రూ. 337 కోట్ల పంచాయతీల సొంత ఆదాయం ఉన్నాయి. అంతా కలిపితే ఏడాదికి రూ. 9,916 కోట్లు సమకూరుతాయి. నాలుగేళ్లలో రూ.39,594 కోట్లు వస్తాయి. ఈ నిధులింకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నిధులతో ఏఏ పనులు చేసుకోవచ్చో గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

• గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా చార్జుడ్ అకౌంట్ నిర్వహించాలి. అప్పులు క్రమం తప్పకుండా చెల్లించాలి. ట్రాక్టర్ల లోన్ రీ పేమెంట్ చేయాలి. కరెంటు బిల్లులు ప్రతీ నెలా తప్పక చెల్లించాలి. 10 శాతం నిధులు హరితహారానికి కేటాయించాలి.

• పల్లె ప్రగతి పేరుతో అప్పుడప్పుడు కార్యక్రమం నిర్వహించడం కాదు. ప్రతీ రోజు ప్రతీ గ్రామం శుభ్రం కావాల్సిందే. ముఖ్యమంత్రి, సిఎస్ నుంచి మొదలుకుని ప్రతీ ఒక్కరి ప్రాధాన్యత గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే. దానికి మించిన పని మరోటి లేదు. గ్రామాలు శుభ్రంగా ఉంటే, ఆరోగ్య సమస్యలు రావు. రోగాలు దరిచేరవు. ఆరోగ్యం కోసం అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గుతుంది. గ్రామాల్లో పారిశుధ్య పనులు బాగా జరగాలనే ఉద్దేశ్యంతోనే కరోనా కష్ట సమయంలో కూడా గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి నెలకు రూ.5 వేల అదనపు వేతనం చెల్లిస్తున్నాం.

• రాష్ట్రంలో ఏమూలకు పోయి చూసినా అంతా శుభ్రంగా కనిపించాలి. అప్పుడు ఈ చెత్తా చెదారం, ముళ్ల పొదలు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

• గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం విధుల నిర్వహణలో కానీ, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణలో గానీ ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చింది. ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదు.

• నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేర్లు గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది.

• జూన్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. ఉద్యమ స్పూర్తితో పచ్చదనం పెంచే కార్యక్రమం సాగాలి. కలెక్టర్లు, డిపివోలు నాయకత్వం వహించాలి.

• సామాజిక అడవులు ఎంత పెంచినా, అది సహజ సిద్ధంగా పెరిగే అడువులకు సాటిరాదు. అందుకే అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, అచ్చంపేట, మెదక్ తదితర జిల్లాల్లో ఇంకా అడవి ఉంది. దాన్ని కాపాడాలి. స్మగ్లర్ల విషయలో కఠినంగా ఉండాలి. స్మగ్లర్లను గుర్తించి, పిడి యాక్టు నమోదు చేయాలి. అటవీ ప్రాంతాల్లో చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

• మిడతల దండు ప్రమాదం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా తొలగిపోలేదు. గతంలో వచ్చిన మిడతల దండులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లిపోయాయి. ప్రస్తుతం మరో దండు వార్దా సమీపంలోకి వచ్చింది. తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు జూన్ 25 నుంచి జూలై నెల వరకు మరోసారి మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఫైర్ అధికారులు, ఎంటమాలజీ నిపుణులు బుధవారం సమావేశమై అవసరమైన వ్యూహం ఖరారు చేయాలి.

• కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా స్థాయిలో అన్ని చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ, దానికి అనుగుణంగా వ్యూహం ఖరారు చేసుకోవాలి. కరోనా విషయంలో పని చేస్తూనే, వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. ఎమ్మెల్యేల సీక్రెట్‌ మీటింగ్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత, జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశం

Telangana Assembly Session: అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, ఈ  డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని వెల్లడి

Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?

Telangana Assembly Session: రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?

Share Now