Telangana: సీఎం కేసీఆర్ నేటి కరీంనగర్ పర్యటన వాయిదా! కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని నిర్ణయం, సిసిఎంబిని వైరస్ నిర్ధారణ కేంద్రంగా ఉపయోగించాలని కేంద్రానికి విజ్ఞప్తి

రోనా వైరస్ వ్యాప్తి (Coronavirus Outbreak) నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) శనివారం కరీంనగర్‌ (Karimnagar) పట్టణంలో పర్యటించనున్నారు. సీఎంతో పాటు.....

Telangana CM K Chandrashekar Rao | File Photo

Hyderabad, March 21:  ఈరోజు షెడ్యూల్ చేయబడిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) కరీంనగర్ జిల్లా పర్యటన వాయిదా పడింది. కరీంనగర్ (Karimnagar) లో కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus Outbreak) నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు మరియు ప్రజల్లో ఆరోగ్యం పట్ల భరోసాను కల్పించేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) శనివారం కరీంనగర్‌ పర్యటనకు పూనుకున్నారు. అయితే ప్రస్థుత పరిస్థితుల్లో సీఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగ్ మరియు వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం, వైద్యశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తదితరుల సూచనల మేరకు ఈరోజు తలపెట్టిన జిల్లా పర్యటన వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.  మార్చి 23 నుంచి మార్చి 30 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా

మొన్న బుధవారం నాడు కరీంనగర్ లో ఒక్కరోజులోనే 7 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన ఓ బృందానికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. ముఖ్యమంత్రి కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తూ వచ్చారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారి ద్వారా స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం వంద బృందాలుగా విడిపోయి చర్యలు చేపట్టింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, శుక్రవారం రాత్రి నాటికి రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ 19కి చేరింది.

సీసీఎంబీని వైరస్ నిర్ధారణ కేంద్రంగా ఉపయోగించండి

 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని సిసిఎంబి (Centre for Cellular and Molecular Biology)ని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్ గా ఉపయోగించాలని సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

ఇక్కడ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తే ఒకే సారి వెయ్యి శాంపిల్స్ పరీక్షించే అవకాశం ఉంది. తద్వారా కేవలం తెలంగాణలోని వారివే కాకుండా దేశ వ్యాప్తంగా ఎక్కడి వారికైనా పెద్ద సంఖ్యలో ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వీలు ఉందని ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. సిసిఎంబి (CCMB) కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. దీన్ని జీవసంబంధ పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేంద్రాన్ని సంప్రదించారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. వైరస్ వ్యాప్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించిన కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగానే సిసిఎంబి గురించి కూడా సీఎం, పీఎంకు వివరించారు.

దేశంలోని అతి పెద్ద నగరాలైన దిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లకు పెద్ద ఎత్తున విదేశాల నుంచి ప్రయాణీకులు వస్తారని, వారిని క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ జనసమ్మర్థం ఉండే ఈ నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేంద్రాన్ని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున, కొద్ది రోజుల పాటు విదేశాల నుంచి విమాన రాకపోకలను పూర్తిగా నిలిపి వేయాలని కోరారు.

ఇక దేశీయంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా ప్రయాణం చేసే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్ల వద్ద పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, రైలు బోగీలలో హై శానిటేషన్ నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జనం గుమిగూడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, శ్రీరామ నవమి, జగ్నే కీ రాత్ లాంటి పండుగల సందర్భంగా కూడా ఉత్సవాలు బంద్ చేసినట్లు కేసీఆర్ వివరించారు. కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement