IPL Auction 2025 Live

Telangana Cabinet Meeting Highlights: తెలంగాణ కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే, లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని నిర్ణయం

సమావేశం అనంతరం కేబినెట్‌ కీలక నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు మీడియాకు వెల్లడించారు.

Harish Rao (Photo-Video Grab)

Hyd, Mar 9: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సుమారు ఐదు గంటల పాటు భేటీ సాగింది. సమావేశం అనంతరం కేబినెట్‌ కీలక నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో దళిత బంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం (Telangana Cabinet Meeting Highlights) తీసుకుందని తెలిపారు.దళితబంధు పథకం ఆగస్ట్‌ 16, 2021న ప్రారంభమైంది.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని హుజూరాబాద్‌లో వందశాతం లబ్ధిదారులకు అందించాం. మిగతా 118 నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి దళితబంధును రెండో విడతలో అందించాలని నిర్ణయం తీసుకున్నాం. 118 నియోజకవర్గాల్లోని 1,29,800 మంది లబ్ధిదారులకు అందించనుండగా.. మరో 200 మందికి చీఫ్‌ సెక్రెటరీ నేతృత్వంలో లబ్ధిదారులకు అందజేయనున్నాం. మొత్తం 1.30లక్షల మందికి అందిస్తామని మంత్రి తెలిపారు.

ఎఫ్-24 టికెట్ ఒకరు కొంటే 4గురు వ్య‌క్తులు రోజంతా హైదరాబాద్ మొత్తం చుట్టేయవచ్చు, సంచలన ఆఫర్లను ప్రకటించిన టీఎస్ఆర్టీసీ

గృహలక్ష్మి పథకం కింద 4లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 4లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించాలని నిర్ణయించాం. అంతే కాకుండా 43వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో పెట్టాలని నిర్ణయించాం. నాలుగు లక్షల ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని, ఇండ్ల నిర్మాణాన్ని వెనువెంటనే చేపట్టాలని కేబినెట్‌లో నిర్ణయించాం. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.3లక్షలు గ్రాంట్‌గా ఇవ్వాలని నిర్ణయించామని హరీష్ రావు తెలిపారు. ఈ రూ.3లక్షలను మూడు దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో దఫాలో రూ.లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని, ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించుకున్నామని మంత్రి తెలిపారు.

మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటి పూట బడులు, ఏప్రిల్ 25 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు

ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఐ మ్యాక్స్‌ థియేటర్‌ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బిడ్డలను హైదరాబాద్‌కు పిలిపించి.. లక్షలాది మంది మధ్య అంబేడ్కర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని హరీశ్‌ రావు తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు.‘గతంలో మొదటి దఫాలో గొర్రెల పంపిణీ పూర్తిగా జరిగింది. మొత్తంగా రాష్ట్రంలో 7.31లక్షల మంది లబ్ధిదారులను గుర్తించాం. ఇందులో 50శాతం పంపిణీ గతంలో పూర్తయ్యింది. మిగతా 50శాతం మందికి గొర్రెల పంపిణీకి వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌, కేబినెట్‌ నిర్ణయించి, రూ.4,463కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నదని హరీష్ రావు తెలిపారు.

రాష్ట్రంలోని 4లక్షల ఎకరాలను 1,55,393 మంది అడవి బిడ్డలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1, 55, 393 మందికి 4 లక్షల 903 ఎకరాలకు సంబంధించి పట్టాలు ప్రింటై.. పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. 4 లక్షల ఎకరాల పంపిణీ వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైనా మిగిలి ఉంటే.. వారికి సైతం పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతుంది’ అని హరీశ్‌రావు వివరించారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఆయా ఇండ్ల నిర్మాణానికి మరోసారి గడువును పొడిగించింది. కటాప్ డేట్ నెల రోజుల పాటు రిలాక్సేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. పేదలకు సంబంధించి జీవో 58,59 కింద కొద్ది మంది మిగిలిపోయిన వారు మేం గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయాం, కటాఫ్‌ తేదీ నుంచి ఉపశమనం కల్పించాలని, పేదలకు అందరికీ ఇండ్లపై హక్కులు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞప్తులు వచ్చాయి.వాటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌..వారందరికీ చివరిసారిగా అవకాశం ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

59జీవో కింద 42వేలమంది లబ్ధిపొందారు. కటాఫ్‌ తేదీ గతంలో 2014లో తేదీ ఉండేది, దాన్ని 2020కి పెంచాం. ఆ లోపు ఎవరైనా ఇండ్లు కట్టుకుంటే వారందరికీ 58, 59 జీవో కింద వారికి హక్కులు కల్పించి, పేదల జీవితాల్లో ఉత్సాహం, ఆనందం నింపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని హరీష్ రావు తెలిపారు.



సంబంధిత వార్తలు