తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు (Half-Day Schools in Telangana) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒంటిపూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించినట్లు సమాచారం.
ఈ ఒంటి పూట బడి సమయంలో ప్రవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన మంచినీరు పిల్లలకు అందేలా చూడాలని విద్యాశాఖ సూచించింది. ఇక తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభించాలని తాజాగా విద్యాశాఖ నిర్ణయించింది.
1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే అయినందున వారికి ఏప్రిల్ 17తో ముగుస్తున్నాయి.ఇక 6 నుంచి 9వ తరగతుల వారికి ఏప్రిల్ 20 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 21వ తేదీన వెల్లడించి రికార్డుల్లో పొందుపరచాలని విద్యాశాఖ తెలిపింది.
ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ఇటీవల వెల్లడించింది. తిరిగి పాఠశాలలు జూన్ 12న పాఠశాలలు పున: ప్రారంభం అవ్వనున్నాయి. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి.