Telangana CM Change Row: ఎవరూ మాట్లాడొద్దు..మరో పదేళ్లు నేనే సీఎం, తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీ ఎవరూ లేరు, టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్, 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

సీఎంగా తానే కొనసాగుతానని, మరో 10 ఏళ్ల వరకు తనను టచ్ చేయలేరని కేసీఆర్ (CM KCR gave clarity) తేల్చి చెప్పారు.

Telangana CM KCR | File Photo

Hyderabad, Feb 7: గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ సీఎం మార్పు (Telangana CM Change Row) ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టత ఇచ్చారు. సీఎంగా తానే కొనసాగుతానని, మరో 10 ఏళ్ల వరకు తనను టచ్ చేయలేరని కేసీఆర్ (CM KCR gave clarity) తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

తెలంగాణ సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రశేఖరరావు సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ఇంకో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ ప్రకటించారు.

ఈ నెల 11న ఉదయం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, మార్చి 1 నుంచి పార్టీ కమిటీల నియామకం జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

రూ.3 వేల కోట్లతో తొమ్మిది ఎత్తిపోతల పథకాలు, ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్, రేపు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం భేటీ, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ముగిసిన తెలంగాణ సీఎం భేటీ

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..‘ఎమ్మెల్సీ, సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయం. పార్టీని మరింత బలోపేతం చేస్తాం.తెలంగాణలో టీఆర్ఎస్‌కు ఎవరూ పోటీ లేరు.నేనే ముఖ్యమంత్రిగా ఉంటా.నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నా. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకుంటాం’అని కేసీఆర్‌ హెచ్చరించారు.

రెండు ఎమ్మెల్సీ స్థానాలు, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్సే గెలవాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు సూచించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ సభ్యత్వం విషయంలో లక్ష్యాన్ని పూర్తిచేయాలని చెప్పారు.

టీఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కాసేపటి క్రితం ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.