Telangana: ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి భారీ ప్రాజెక్టులు నిర్మించాం, వాటి ఫలితం ప్రజలకు చేరాలి! సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష, నీటి వాడకంపై మంత్రులకు, అధికారులకు దిశానిర్ధేశం

ఇప్పటికే నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు. కాబట్టి వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి....

CM KCR Review Meeting | Photo: CMO

Hyderabad, July 12:  ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వీలైనంత ఎక్కువ మంది రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరోటి లేదని, దీనికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులు నింపాలని, తర్వాత రిజర్వాయర్లు నింపాలని, చివరికి ఆయకట్టుకు అందించాలని సూచించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరిధిలోని వరద కాలువకు వీలైనంత ఎక్కువ ఓటీలు ఏర్పాటు చేసి, ఇతర స్కీములతో సాగునీరు అందని ప్రాంతాల చెరువులను నింపాలని చెప్పారు. నీటి పారుదల శాఖలోని అన్ని విభాగాలను వెంటనే ఒకే గొడుగు కిందకి తీసుకురావాలని ఆదేశించారు.

వివిధ ప్రాజెక్టుల కాల్వల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై సీఎం కేసీఆర్ ఇవాళ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు, గ్రామాల నుంచి ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.

‘‘గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసింది. ఉద్యమ స్పూర్తితో చెరువులను పునరుద్ధరించింది. ఇలా చేసిన పనుల ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే మార్గం. ఇప్పటి వరకు తెలంగాణ సాగునీటికి గోస పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడింది. అలా వచ్చిన నీటిని సంపూర్ణంగ వినియోగించుకోవాలి. ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలి. అన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు పంపించడానికి అనువుగా కాల్వల సామర్థ్యం ఉందా లేదా మరో సారి పరిశీలించాలి. అవసరమైతే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలి. ముందుగా చెరువులను నింపాలి. తర్వాత రిజర్వాయర్లను నింపాలి. చివరికి ఆయకట్టుకు నీరందించాలి. ఈ విధంగా ప్రణాళికా ప్రకారం నీటిని సరఫరా చేయాలి. దీనివల్ల వానాకాలంలో లభించే నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలి. ఫలితంగా భూగర్భ జలమట్టం పెరిగి రైతులు దాదాపు 45 వేల కోట్ల వ్యయం చేసి వేసుకున్న బోర్లకు నీరందుతుంది. అటు కాల్వలు, ఇటు చెరువులు, మరోవైపు బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుంది’’ అని కేసీఆర్ అన్నారు.

‘‘ఈ ఏడాది కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు. కాబట్టి వెంటనే జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి. రామన్ పాడు రిజర్వాయర్ నింపాలి. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డి 82 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలి’’ అని సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.



సంబంధిత వార్తలు

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పేదవారిపై నిర్లక్ష్యం తగదు...ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటన