CM KCR to District Collectors: ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయడమే కలెక్టర్ల విధి, సొంత ఎజెండా కలిగి ఉండరాదు, మార్పు రాకుంటే ఉపేక్షించం, కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం, హైలైట్స్ ఇవీ

కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలి. ఒక టీమ్ లాగా అధికార యంత్రాంగం పనిచేయాలి. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలి. కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, కంటివెలుగు లాంటి కార్యక్రమాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాలు....

CM KCR Conference with District Collectors | Photo: CMO

Hyderabad, February 12:  రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం (District Administration) ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని సీఎం కేసీఆర్ (CM KCR) , కలెక్టర్లకు ఉద్భోదించారు.

ప్రభుత్వం అనేక సంప్రదింపులు జరిపిన తర్వాతే వాస్తవిక దృష్టితో చట్టాలు చేయడం, కార్యక్రమాలు రూపొందించడం చేస్తుందని సీఎం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలని చెప్పారు.

జిల్లా కలెక్టర్లు (District Collectors) , అడిషనల్ కలెక్టర్లతో ఒక రోజంతా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్, తమ ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో తెలుపుతూ కలెక్టర్లు తీసుకోవాల్సిన బాధ్యతలపై దిశానిర్ధేశం చేశారు.

సీఎం కేసీఆర్ సమావేశంలోని ముఖ్యాంశాలు

 

• తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది. రూ. 40వేల కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. చాలా తక్కువ సమయంలోనే విద్యుత్ సమస్యను అధిగమించాం. నేడు దేశంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం. మిషన్ భగీరథ పథకం వల్ల ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా సాగుతున్నాయి. ఇప్పుడు మన ముందు ఉన్న అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడం. అదే మనకు అత్యంత ముఖ్యమైన పని.

• పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. ఇది కొద్ది కాలం చేసి ఊరుకునే కార్యక్రమం కాదు, ఈ కార్యక్రమం నిరంతరం సాగాలి. దేశంలో ఆదర్శ పల్లెలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలి. గ్రామాల్లో ఎవరు చేయాల్సిన పనిని వారితోనే చేయించాలి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవస్థతో పనిచేయించాలి.

• గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా విభాగాలు చిన్నవి అయ్యాయి. ఇది పల్లెలను బాగు చేసుకోవడానికి ఎంతో సానుకూల అంశం. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య కాకుండా ప్రతీ నెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నాం. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించాం. ఎంపిఓలను, ఎంపిడివోలను, డిఎల్పివో, డిపిఓ, జడ్పీ సిఇవో లాంటి పోస్టులన్నింటినీ భర్తీ చేశాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాము. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం తన అధికారాలను వదులుకుని కలెక్టర్లపై నమ్మకంతో వారికి బదిలీ చేసింది. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాధ్యతను కలెక్టర్లదే.

• కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలి. ఒక టీమ్ లాగా అధికార యంత్రాంగం పనిచేయాలి. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలి. కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, కంటివెలుగు లాంటి కార్యక్రమాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాలు. ఎంతో మేధో మథనం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తుంది. అలాంటి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో కలెక్టర్లు అమలు చేయాలి.

• రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం’ నిర్వహించాలి.  గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యటిస్తాయి. ముఖ్యమంత్రిగా నేను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తాను. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి.

• గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతీ కలెక్టర్ వద్ద రూ. 1 కోటి చొప్పున అందుబాటులో ఉంచుతాము.

• గ్రామాల్లో మొక్కలు నాటడం మాత్రమే కాదు. అడవుల్లో కలప స్మగ్లింగును అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. చెట్లు నరకకుండా చూడాలి. అటవీ భూముల్లో దట్టమైన అడవులు పెంచాలి. పది ఎకరాల అటవీభూమిలో అడవిని అభివృద్ధి చేయడం పదివేల ఎకరాల్లో సామాజిక అడవులు పెంచడంతో సమానం. కాబట్టి అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి.

• హైదరాబాద్, గద్వాల, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవుల శాతం చాలా తక్కువగా ఉంది. అక్కడి కలెక్టర్లు సామాజిక అడవులు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

• ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నారు. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటించాలి. కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలి.

• పంచాయతీ రాజ్ శాఖలో దాదాపు ఖాళీలన్నీ భర్తీ చేశాము. ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం.

• పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తుంది.

• పంచాయతీ రాజ్ శాఖ మాదిరిగానే మున్సిపల్ శాఖలో కూడా అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని ఖాళీలున్నాయి. ఎక్కడెక్కడ ఏ పోస్టులు భర్తీ చేయాలో మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.

• సముద్రం ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరగడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఢిల్లీకి అదే సమస్య ఉంది. ఇప్పుడు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ముందున్న హైదరాబాద్ నగరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం కాకతప్పదు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. హైదరాబాద్ నగరం లోపల, చుట్టూ కలిపి లక్షా 60వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో దట్టమైన అడవులు పెంచాలి. వనస్థలిపురం హరిణవనస్థలిని కేబీఆర్ పార్కులాగా తయారు చేయాలి. నగరంలో కాలుష్యం నివారించడానికి అనుగుణమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. డిజిల్ వాహనాలు తగ్గించి, ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెంచే చర్యలు తీసుకోవాలి. ఈ నగరాన్ని కాలుష్యమయం కాకుండా చూసుకోవాలనే స్పృహ ప్రతీ ఇంటిలో కూడా కలిగించే చర్యలు తీసుకోవాలి.

• అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యత విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిన తీసుకోవాలి. తమ గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలి. తమ జిల్లాను పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లాగా మార్చే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలి. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

• సివిల్ సర్వీస్ అధికారులకు దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. మంచి ఆలోచనా విధానం ఉండాలి. అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్న యువ ఐఎఎస్ అధికారులే రేపు రాష్ట్రానికి కార్యదర్శులుగా, శాఖాధిపతులుగా, వివిధ హోదాల్లో పనిచేస్తారు. కాబట్టి వీరికి విషయ పరిజ్ఞానం పెరగడం రాష్ట్రానికి మంచిది. మంచి విధానాలు అమలవుతున్న ఇతర దేశాల పర్యటనలకు పంపాలి. అన్ని రంగాల్లో ఉత్తమ పద్ధతులు, విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేయాలి.

• కొత్తగా తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపల్ చట్టం ద్వారా గ్రామాలు, పట్టణాల పాలనలో కలెక్టర్ల బాధ్యతను ప్రభుత్వం పెంచింది.

• అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల నిర్వహణను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది. రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలోనే ఉంటుంది.

• భూ సంబంధ రికార్డులు పక్కాగా ఉండాలి. ఖచ్చితంగా సంస్కరణలు రావాలి. 95 శాతం భూముల విషయంలో ఎలాంటి పేచీ లేదు. మిగతా వాటిని పరిష్కరించాలి.

• పట్టణ ప్రగతి కార్యక్రమానికి పట్టణాల్లోని వార్డును యూనిట్ గా చూడాలి. ఆ వార్డులోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం నియమించే ప్రజా కమిటీలోని సభ్యులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణంలో పాదయాత్రలు చేసి, వార్డుల వారీగా సమస్యలు గుర్తించాలి. మొత్తం పట్టణానికి సంబంధించిన సమస్యలు గుర్తించాలి.

• ప్రత్యామ్నాయం చూపించకుండా వీధుల వెంట షాపులు నిర్వహించేవారిని, టాక్సీ స్టాండ్లను, ఫుట్ పాత్ లపై వ్యాపారం చేసుకునేవారిని బలవంతంగా తరలించవద్దు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Chandrababu on Telangana: వీడియో ఇదిగో, నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Liquor, Meat Ban in Madhya Pradesh: మత పరమైన ప్రదేశాల్లో మాంసం, మద్యం దుకాణాలు బంద్, కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న మధ్యప్రదేశ్ సర్కారు

Kiran Kumar Reddy on YSR: వైఎస్ఆర్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చి ఉండేది, కొత్త చర్చకు తెరలేపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మేం తెలంగాణకు అనుకూలం తీర్మానం అసెంబ్లీలో పెట్టాలంటూ..

Share Now