TS Agriculture Policy: వ్యవసాయం లాభసాటిగా మార్చటమే లక్ష్యం! సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించేలా అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు, మరోవైపు రాష్ట్రంలో లాక్డౌన్ పరిస్థితులపై సమీక్ష
దానికి అనుగుణంగానే ప్రతీదీ జరగాలి. రైతులు ఏ పంటలు వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలి. తెలంగాణ ప్రజల ఆహార అవసరాలు, ఇతర ప్రాంతాల్లో డిమాండుకు తగిన పంటలు వేసేలా ప్రణాళిక తయారు చేయాలి....
Hyderabad, May 10: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తేవాలని సీఎం కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్లస్టర్ల వారీగా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో తాను మాట్లాడనున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
‘‘రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలి. దానికి అనుగుణంగానే ప్రతీదీ జరగాలి. రైతులు ఏ పంటలు వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలి. తెలంగాణ ప్రజల ఆహార అవసరాలు, ఇతర ప్రాంతాల్లో డిమాండుకు తగిన పంటలు వేసేలా ప్రణాళిక తయారు చేయాలి. ప్రత్యామ్నాయ పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. దాని ప్రకారమే సాగు జరగాలి. రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘వ్యవసాయ శాఖ ఇన్వెంటరీ తయారు కావాలి. వ్యవసాయ శాఖకున్న ఆస్తులు, భవనాలు ఇతరత్రా వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. గ్రామాల్లో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలి. ఇంకా రైతులకు ఏమి కావాలో గుర్తించాలి. దానికి అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేయాలి. రైతుల నుంచి వివరాలు సేకరించాలి. ఖచ్చితమైన వివరాలతో ఫార్మాట్ ద్వారా సమాచారం సేకరించాలి. త్వరలోనే నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చిస్తాను’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా మరో 31 పాజిటి కేసులు, మరొక కరోనా మరణం నమోదు, రాష్ట్రంలో 1163కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య
కరోనా కట్టడి చర్యలపై సీఎం సమీక్ష
సీఎం కేసీఆర్ ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెడుతూనే మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి శనివారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి సంబంధించి జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. లాక్ డౌన్ అమలు, వివిధ ప్రాంతాల్లో అమలవుతున్న సడలింపుల వల్ల తలెత్తిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.