COVID19 in TS: తెలంగాణలో కొత్తగా మరో 31 పాజిటి కేసులు, మరొక కరోనా మరణం నమోదు, రాష్ట్రంలో 1163కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, అయినప్పటికీ ఆక్టివ్ కేసుల సంఖ్య స్వల్పమే
Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, May 9: తెలంగాణ రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1163కు చేరింది. నమోదైన మొత్తం కేసుల్లో 30 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కాగా, వలస కార్మికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జిల్లాల నుంచి కొత్తగా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అయితే ఈరోజు కరోనా కారణంగా మరొకరు ప్రాణాలు విడిచారు, దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 30కి పెరిగింది.

శనివారం మరో 24 మంది కోవిడ్-19 పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 751 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 382 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

 

ఇక కోవిడ్-19 నుంచి కోలుకునే వారి సంఖ్య రోజురోజుకి మెరుగవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కృషి ఫలితమే అని చెప్పారు. ఆపదలో ఆపన్నహస్తం అందించేది ప్రభుత్వమే అని మరో మారు తెలంగాణ ప్రభుత్వం నిరూపించిందని, ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించడంలో విజయవంతం అయ్యిందని ఈటల రాజేంధర్ అన్నారు. గత రెండు నెలలుగా నిద్రాహారాలు మాని కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంలో, పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్ లు , నర్సులు మరియు ఇతర వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది అందరికీ మంత్రి ఈటల ధన్యవాదాలు తెలిపారు. అందరి కృషి వల్లనే తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. అలా అని ఏ ఒక్కరూ రిలాక్స్ అవ్వవద్దని సూచించారు. నిన్నటి వరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కోవిడ్ మీద పని చేసిందని, కానీ ప్రస్తుతం లాక్ డౌన్ నిబందన సడలించడంతో మిగిలన డిపార్ట్మెంట్లు అన్నీ వారి వారి పనుల్లో మునిగిపోతారు.. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ మీద భారం పెరుగుతుంది అని మంత్రి అన్నారు. ఆశ వర్కర్ నుండి టెర్షరీ కేర్ వరకు ప్రతి ఒక్క ఉద్యోగి సెలవులు లేకుండా నిబద్దతతో మరి కొద్ది రోజులు పనిచేయాలని కోరారు.

డాక్టర్లది పవిత్రమైన వృత్తి అని, భయపడకుండా వైద్యం అందిచాలని కోరారు. బాగా పని చేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తిస్తుంది అని, అదే సమయంలో పని చేయకుండా టైమ్ పాస్ చేసేవారికి డిపార్ట్మెంట్ లో స్థానం ఉండదు అని మంత్రి హెచ్చరించారు. ప్రస్తుతం డాక్టర్లంటే సమాజంలో గౌరవం బాగా పెరిగిందని, దానిని నిలబెట్టుకోవాలని కోరారు. సేవ చేసే అదృష్టం అందరికీ రాదు అని అన్నారు. బ్రిటన్ ప్రధాని లాంటి వారే దేవుడు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇచ్చారని చెప్తున్నారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ సూచనలతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.