CM KCR Fire on BJP: ఎదురుమాట్లాడితే ప్రభుత్వాలు కూలుస్తారా? మోదీ సర్కారుపై ఫైరయిన సీఎం కేసీఆర్, కేంద్రం పాలన పైన పటారం..లోన లొటారం అంటూ ఘాటు వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కేంద్రంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు విఫలయత్నం చేసిన ఘటనపై కేసీఆర్ స్పందిస్తూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చాలనుకున్నారని, కుట్రలను తిప్పి కొట్టామని చెప్పారు.
Mahabubnagar, DEC 04: ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండి కూడా దేశానికి ప్రధాని మోదీ సర్కారు చేసిందేమీ లేదని ఫైరయ్యారు సీఎం కేసీఆర్. పైన పటారం.. లోన లొటారం.. చెప్పేదంతా డంబాచారం అంటూ మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కాలేజీ బహిరంగ సభలో తెలంగాణ పట్ల కేంద్రం, ప్రధాని మోదీ (PM Modi) వ్యవహరిస్తున్న తీరును సీఎం కేసీఆర్ (CM KCR) తూర్పారబట్టారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కి దొంగలు వచ్చారని, వారిని పట్టుకుని జైల్లో వేశామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ కేంద్రంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు విఫలయత్నం చేసిన ఘటనపై కేసీఆర్ స్పందిస్తూ… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చాలనుకున్నారని, కుట్రలను తిప్పి కొట్టామని చెప్పారు. టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వాన్ని కూల్చుతామన్నారని, ఏ కారణంతో ప్రభుత్వాన్ని కూల్చుతారని ఆయన బీజేపీ నేతలను నిలదీశారు. తాను సీరియస్‌గా ఓ మాట చెబుతున్నానని, వాళ్ల మాటలు కోటలు దాటుతున్నాయని కేసీఆర్ అన్నారు.
‘‘చిల్లరగాళ్లను గమనించాలి. లేదంటే ప్రజలే నష్టపోతారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎదురు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తామని అంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని మోదీయే స్వయంగా అన్నారని చెప్పారు. గతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కూడా బెదిరించారని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యమా? అని అడిగారు. తాను ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పానని అన్నారు. 24 గంటలు విద్యుత్తు ఇస్తానని చెప్పానని గుర్తు చేశారు.
అన్ని హామీలు నెరవేర్చుతున్నామని అన్నారు. ఢిల్లీలోనూ పోరాడదామా? అని ప్రజలను అడిగారు. అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణకు నష్టం వస్తోందని చెప్పారు. కృష్ణా జలాల్లో (Krishna Water Share) వాటా తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదేళ్ల సమయం సరిపోదా? అని నిలదీశారు. అప్పట్లో పాలమూరులో వలసలు అధికంగా ఉండేవని, ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడిన జిల్లాగా మారిందని అన్నారు. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ గురించే మాట్లాడుతోందని చెప్పుకొచ్చారు.