IPL Auction 2025 Live

TSRTC Strike- Day 13: సమ్మె దురుద్దేశ్యపూర్వకం, వారికి ఎంత చేసినా లాభం లేదన్న కేసీఆర్, 13వ రోజుకు చేరిన టీఎస్ ఆర్టీసీ సమ్మె, డిపోల ఎదుట ధూంధాం

ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి రూ. 3,300 కోట్లు ఆర్థిక సహాయం అందించాం, అయినప్పటికీ...

13th Day of TSRTC Strike | File Photo

Hyderabad, October 17: ఇటు ఆర్టీసీ కార్మికులు పంతం వీడటం లేదు, అటు సర్కార్ కూడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) గురువారం 13వ రోజుకు చేరుకుంది. ముందుగానే ప్రకటించిన తమ కార్యాచరణలో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు 'ధూంధాం' పేరుతో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వానికి మరియు సీఎం కేసీఆర్ (CM KCR) కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సు డిపోల ముందు బైఠాయించి, బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్మికులు ఎంతసేపటికి వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, అక్కడ్నించి తరలించారు.

ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి రాకపోయినా, తాత్కాలిక డ్రైవర్లతో సర్కార్ బస్సులను నడిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బస్సులను అడ్డుకోకుండా, ధ్వంసం చేయకుండా అన్ని బస్సు డిపోల ఎదుట పటిష్ఠమైన బందోబస్తు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

కొన్నిచోట్ల అధికార పార్టీ నాయకుల ఇళ్లను కూడా కార్మికులు ముట్టడిస్తుండటంతో నాయకుల ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తు పెంచారు.

Additional police forces deployed at all TSRTC bus depots in view of ongoing strike | File Photo

ఓయూలోని పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్ధతుగా సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలు దేరాయి, అయితే మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు.

సమ్మె విరమించాలని ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు హైకోర్ట్ సూచించింది, ఇటువైపు కార్మికులకు చర్చలకు ఆహ్వానించాలని ప్రభుత్వానికి కూడా సూచించింది. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాలేదు. ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం మరోసారి హైకోర్టులో ప్రభుత్వం నివేదిక సమర్పించాల్సి ఉంది.

వెనక్కి తగ్గని సర్కార్, సమ్మె వల్ల పూడ్చుకోలేని నష్టమేర్పడిందని సీఎం కేసీఆర్ ఆగ్రహం

సంస్థ ఆర్థిక పరిస్థితిని, ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకోకుండా అనాలోచితంగా సమ్మెకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులతో ఎట్టి పరిస్థితుల్లో చర్చకు వెళ్లాల్సిన అవసరమే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె, హైకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రవాణా మంత్రి, ఇతర ఉన్నత అధికారులతో బుధవారం సాయంత్రం నుంచి దాదాపు 5 గంటల పాటు సీఎం సమావేశం నిర్వహించారు.

ఆర్టీసీ సమ్మె దురుద్దేశపూర్వకం అని వ్యాఖ్యానించిన సీఎం, గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చాం, 67 శాతం వేతనాలు పెరిగాయి. ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి రూ. 3,300 కోట్లు ఆర్థిక సహాయం అందించాం, అయినప్పటికీ కార్మికుల పనితీరు మారలేదు. ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ నష్టాలు రూ. 5000 కోట్లకు చేరింది.

దసరా పండుగ సీజన్ లో సమ్మె చేపట్టి పూడ్చుకోలేనంతగా సంస్థను నష్టపరిచారు. పండగనాడు ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. అక్టోబర్ 05 నుంచి ఇప్పటివరకు రూ. 150 కోట్లు నష్టం ఏర్పడింది అని సీఎం చెప్పారు.

ఇప్పటికిప్పుడు హడావిడిగా ఆర్టీసీ ఎండీ నియామకం సాధ్యం కాదని, రేపు కోర్టులో ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 21 నుంచి స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎక్కడా ఏ లోటు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.