CM Revanth Reddy Review on RRR: రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణప అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. ఆర్ఆర్ఆర్, జాతీయ రహదారుల భూ సేకరణ, పరిహారం, హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటి మోడల్) విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
Hyderabad, JAN 03: రీజనల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. రైతులకు పరిహారం (RRR Land Aquation) నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. ఆర్ఆర్ఆర్, జాతీయ రహదారుల భూ సేకరణ, పరిహారం, హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటి మోడల్) విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. భూ సేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతోనూ చర్చించాలని చెప్పారు. తరచూ రైతులతో సమావేశమై.. ఆయా రహదారుల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను వివరించి భూ సేకరణను వేగవంతం చేయొచ్చని అన్నారు. ఆర్ఆర్ఆర్ (దక్షిణ)కు ఎన్‌హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున హెచ్ఎండీఏతో (HMDA) అలైన్‌మెంట్ చేయించాలని సూచించారు.
హైదరాబాద్‌ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడం, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉండడంతో పాటు ఔటర్ రింగు రోడ్డు, ఆర్ఆర్ఆర్ అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా సాగే నాగ్‌పూర్-విజయవాడ (ఎన్‌హెచ్-163జీ) రహదారి, ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల రహదారి (ఎన్‌హెచ్-63), జగిత్యాల-కరీంనగర్ (ఎన్‌హెచ్ 563) రహదారుల నిర్మాణంతో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల (ఎల్‌డబ్ల్యూఎఫ్) రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, అటవీ అనుమతుల్లో అడ్డంకుల తొలగింపునకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.
ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్) డోబ్రియల్‌ను సీఎం ప్రశ్నించారు. గతంలో కొన్ని నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు ఉన్నాయని పీసీసీఎఫ్ బదులిచ్చారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించిన సమస్యలపై వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఆర్ అండ్ బీ, అటవీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారానికి కేటాయించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారితో పది రోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్స్ వచ్చేలా చూడాలని, ఇక్కడ కాకపోతే ఆర్ అండ్ బీ, అటవీ శాఖ మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులతో సమావేశమై అనుమతులు సాధించాలని సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాస్‌ల నిర్మాణాన్ని విస్మరిస్తుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రైతులు కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చూడాలని సీఎం సూచించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)