Yadadri Temple: యాదాద్రి చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి! లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్, యాదాద్రి పునర్మిణాల పనులపై సీఎం సంతృప్తి, నిదానంగా పకడ్బందీగా నిర్మాణాలు సాగాలని సూచన
ఆలయ నిర్మాణ పనులు ఒక డెడ్ లైన్ పెట్టుకుని చేసేవి కావు. శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు కాబట్టీ ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. ఏ మాత్రం తొందరపాటు అవసరం లేదు...
Yadadri, December 18: వివిధ శాఖల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ (CM KCR) మంగళవారం ఆరున్నర గంటల పాటు యాదాద్రి (Yadadri)లో పర్యటించారు. మొదట లక్ష్మీనరసింహ స్వామి (Sri Laxmi Narasimha Swamy) కి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన కేసీఆర్, అనంతరం రెండు గంటల పాటు ప్రధాన ఆలయ నిర్మాణ ప్రాంతంలో కలియ తిరిగారు. గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్థంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణీ, యాగశాల తదితర నిర్మాణాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. యాదాద్రి ప్రధాన ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత, ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
పనుల నాణ్యత విషయంలో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రాతి శిలలను అద్భుత కళాకండాలుగా మలిచిన శిల్పులను అభినందించారు. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండే విధంగా రూపకల్పన చేశారని సీఎం కొనియాడారు. 560 మంది శిల్పులు నాలుగేళ్లుగా పడుతున్న కష్టం ఫలించి అద్భుత ఆకారాలతో కూడి ప్రాకారాలు సిద్ధమయ్యాయని అన్నారు. వందకు వంద శాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్ధడం యాదాద్రిలోనే సాధ్యమయిందని సీఎం అన్నారు.
నిదానమే ప్రధానం, ఆగమ శాస్త్రాల ప్రకారం పకడ్బందీ నిర్మాణాలు జరగాలి
యాదాద్రి ఆలయ పునరుద్ధరణ (Yadadri Renovation) పనులు శాశ్వతంగా నిలిచిపోయేవి కాబట్టి ఎలాంటి తొందరపాటు, ఆతృత అవసరం లేదని సీఎం చెప్పారు. ఆగమ శాస్త్ర నియమాల (Agamashastra rules) ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరగాలని సూచించారు.
‘‘ఆలయ నిర్మాణ పనులు ఒక డెడ్ లైన్ పెట్టుకుని చేసేవి కావు. శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు కాబట్టీ ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. ఏ మాత్రం తొందరపాటు అవసరం లేదు. జాగ్రత్త, నాణ్యతా పాటించాలి. నిర్మాణాలు పటిష్టంగా ఉండాలి. ప్రతీది నియమాలను అనుసరించి సాగాలి. ఇది సనాతన ఆలయం, ఇక్కడ పూజలు చేయటం చాలా మందికి వారసత్వంగా వస్తున్న సంప్రదాయం. దేశ విదేశాల్లో లక్ష్మి నర్సింహస్వామికి భక్తులున్నారు. రాబోయే కాలంలో యాదాద్రికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ భక్తులకు దైవ దర్శనం విషయంలో కానీ, వసతి సౌకర్యంలో కానీ, పుణ్య స్నానాల విషయంలో కానీ, తలనీలాల సమర్పణలో కానీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యం కావాలి’’ అని సీఎం అన్నారు.
చుట్టూ పచ్చదనం, సకల సౌకర్యాలతో ఆహ్లదం పంచేలా..
ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు పెంచాలని సూచించారు. అలాగే దేవాలయ ప్రాశస్త్యం, లక్ష్మీ నర్సింహస్వామి చరిత్ర, స్థలపురాణం ప్రస్పుటించే విధంగా ఆలయ ప్రాంగణంలో తైల వర్ణ చిత్రాలను వేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అనంతరం యాదాద్రిలో జరుగుతున్న రింగురోడ్డు పనులను పరిశీలించారు. సకల సౌకర్యాలతో కూడిన 15 వివిఐపి కాటేజీలతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ కొన్ని మార్పులను సూచించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వారు వచ్చినపుడు వారికి సౌకర్యవంతంగా ఉండేలా ప్రెసిడెన్షియల్ సూట్ ఉండాలని చెప్పారు.
బస్వాపురం రిజర్వాయర్ ను పర్యాటక ప్రాంతంగా మారుస్తున్న విధంగానే ప్రెసిడెన్షియల్ సూట్ కు సమీపంలో వున్న మైలార్ గూడెం చెరువును సుందరీకరించాలని సీఎం ఆదేశించారు. ప్రధాన దేవాలయ ఉండే గుట్ట నుండి రింగురోడ్డు మధ్య భాగంలో గతంలో అనుకున్న ప్రకారం నిర్మాణాలన్నీ సాగాలన్నారు. కోనేరు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)