Coronavirus in Telangana: ఒకరి నుంచి 8–9 మందికి కరోనా వ్యాప్తి, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు, సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ (Coronavirus Second Wave in Telangana) మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (telangana state government) నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad, Mar 28: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ (Coronavirus Second Wave in Telangana) మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (telangana state government) నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిషేధిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. హోలీ, శ్రీరామ నవమి వేడుకల్లో ప్రజలు గుమిగూడవద్దని తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ రెండు జీవోలు జారీ చేశారు. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు.
మత సంబంధిత సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. సామూహిక కార్యక్రమాలతో కరోనా వ్యాప్తికి ఎక్కువ ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించినట్టు సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. షబ్–ఏ–బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్‌ఫ్రైడే, రంజాన్ తదితర వివిధ మతాల పండుగలు, ఉత్సవాలకు ఎవరినీ అనుమతించడం లేదని స్పష్టంచేశారు.
ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం–2005, సంబంధిత ఇతర చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్కులు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్ 188 కింద కేసులు పెడతామని తెలిపారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు.
దేశంలో మళ్లీ కోవిడ్–19 కేసులు (Coronavirus in Telangana) పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకోవడానికి అనుమతిస్తూ ఈ నెల 23న కేంద్ర హోమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించింది.
ఇక కరోనా సెకండ్ వేవ్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు జి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తే సెకండ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. శనివారం హైదరాబాద్‌లో వైద్యవిద్య విభాగం సంచాలకుడు రమేశ్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో కోటి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్య పెంచాం. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రజల నిర్లక్ష్య ధోరణితోనే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏడాదిగా చాలా పాఠాలు నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు.
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రజల నుంచి స్పందన పెద్దగా రావట్లేదు. రాష్ట్రానికి ఇప్పటివరకు 24.49 లక్షల వ్యాక్సిన్ డోసులు రాగా వాటిలో దాదాపు 12 లక్షలు వినియోగించాం. సగటున 1% వేస్టేజీ ఉంటుంది. కానీ రాష్ట్రంలో కేవలం 0.7 శాతమే ఉంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్నాక కరోనా వచ్చినా ప్రమాదకర పరిస్థితి మాత్రం ఉండదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 250 చెల్లించి టీకా తీసుకోవచ్చు. కొన్ని ఆస్పత్రులు రూ. 150 మాత్రమే తీసుకుంటున్నాయి. రూ.100 సర్వీసు చార్జీని వసూలు చేయట్లేదని తెలిపారు.
ప్రస్తుతం హోలీ, ఉగాది, ఈస్టర్, రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు గుమిగూడే పరిస్థితులు ఉంటాయి. వాటికి దూరంగా ఉండటమే మంచిది. 60 ఏళ్లు దాటిన వారు, పిల్లలు ఈ వేడుకలకు దూరంగా ఉండాలి. పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందితే ప్రమాదం కానప్పటికీ ఎక్కువ మందికి మ్యుటేషన్ అయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్నచోట మైక్రో కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం’అని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వివరించారు.
ఒకరికి కరోనా వస్తే ఆ వ్యక్తి నుంచి 8–9 మందికి వ్యాపిస్తుందనే అంచనా ఉందని వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి తెలిపారు. పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మందికి లక్షణాలు ఉండట్లేదని వివరించారు. కరోనా బారినపడి లక్షణాలు తీవ్రమైన కేసుల్లో మాత్రం దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కేసులు ఆస్పత్రుల్లో ఇప్పటికీ కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగినప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లతో యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.